ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్
నేటి ఆందోళన కార్యక్రమాలకు మద్దతు
కృష్ణలంక(విజయవాడతూర్పు): కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై తక్షణం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆయనను అభిశంసించాల్సిన అవసరం ఉందని పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఉద్ఘాటించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ‘ఓటర్ల జాబితాల అక్రమాలు–ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే అంశంపై అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 28, అక్టోబర్ 2వ తేదీలలో నిర్వహించే దేశవ్యాప్త నిరసన, ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని రౌండ్‌టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ‘దేశంలో సక్రమంగా, స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం లేదు. వ్యవస్థల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రజలను చైతన్య పరచాలి. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియలోకి సీజేఐని తీసుకుని, ఆయన అధ్యక్షతన కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో 32 లక్షల ఓట్లను అన్యాయంగా తొలగించారు. ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియపై అనేక అనుమానాలు ఉన్నాయి.
ఎన్నికల్లో విశ్వసనీయతను పెంపొందించేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన సూచనలను అమలుచేయాలి. ఎన్నికల్లో అక్రమాలను సమర్థించేలా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం’అని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, కేంద్ర మాజీమంత్రి జె.డి.శీల, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ఓటు పరిరక్షణ వేదిక కన్వీనర్ సుంకర రాజేంద్రప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, జనచైతన్య వేదిక నాయకుడు వి.లక్ష్మణరెడ్డి, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకుడు హరినాథ్, న్యూడెమోక్రసీ నాయకులు పి.పొలారి, ఎం.రామకృష్ణ, సామాజికవేత్త కుర్రా వసుంధర తదితరులు మాట్లాడారు.


