తాడేపల్లి: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసనకు దిగిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవిక దాడి చేసిందని, ఇది ఒక అమానుష చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి అత్యంత తీవ్రమైన విషయమని, వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? ప్రశ్నించారు. ఈ మేరకు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం అమానుష చర్యలను ఖండించారు వైఎస్ జగన్.
చంద్రబాబు… ఇది ప్రజాస్వామ్యమేనా?
‘ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా?, మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా?, శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు?, ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్‌స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా?, ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా?, చంద్రబాబు గారూ… ఇది ప్రజాస్వామ్యమేనా?, రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది?, అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?, చంద్రబాబూ… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు. ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే.
ఐఆర్ లేదు.. పీఆర్‌సీ లేదు..
మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్‌సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్‌సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు.ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.4౦వేల కోట్లు. వీటికితోడు , మీరు ఆ సీట్లోకి వచ్చిన తొలిరోజు నుంచే, మేం దేశంలో ఎక్కడాలేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా, తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం దాడిచేస్తూనే ఉన్నారు.
గ్రామ స్వరాజ్యం కనబడకుండా కుట్రలు
గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు.. వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు.
ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. పారదర్శకతకూ, ఇంటివద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు, ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?
,ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి..
చంద్రబాబూ.. వెంటనే ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి. ఈ సందర్భంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటికంటే మరింత బలోపేతం చేస్తాం. . తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మీ ద్వారా మళ్లీ అందేలా, దేశం మీవైపు చూసేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లు మూసుకుంటే ఆ కాలంకూడా ఇట్టే గడిచిపోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది’ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సచివాలయ ఉద్యోగులపై ఉక్కుపాదం


