సాక్షి, తాడేపల్లి: గ్రామ సచివాలయ ఉద్యోగులపై ఉక్కు పాదం అన్యాయం.. వారు రాజ్యాంగబద్దంగా గళాన్ని విప్పితే అణచివేస్తారా? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే అరెస్టు చేసిన వందలాది మంది ఉద్యోగులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం వైఎస్ జగన్ సచివాలయ వ్యవస్థను తెస్తే చంద్రబాబు దాన్ని సర్వనాశనం చేశారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులను లాఠీలతో కొట్టించటం అన్యాయం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరితే కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు. డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం చేసిన మా వాళ్లపై పోలీసులతో దాడులు చేయించారు. ఆ దాడుల్లో మా నేత కాకుమాను రాజశేఖర్ చనిపోయారు. రక్షక భటులు రాక్షస భటులుగా మారిపోయారు’’ అని టీజేఆర్ ధ్వజమెత్తారు.
ఈ ఘటనకు బాధ్యడిని చేస్తూ డీజీపీపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు సహేతుకమైనవి. వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం వేధింపులకు దిగటం అన్యాయం. శాప్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా?. మా ఎమ్మెల్సీలు తలశిల, లేళ్ల అప్పిరెడ్డి రౌడీషీటర్లు అయితే చంద్రబాబు, లోకేష్ కూడా రౌడీషీటర్లే. కరోనా సమయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులే ప్రజలను కాపాడారు. అలాంటి వారి సమస్యలు పరిష్కారం చేయకపోగా పోలీసులతో కొట్టిస్తారా?’’ అంటూ టీజేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సీఎం పర్యటనల ఈవెంట్స్ ఖర్చు రూ.44.62 కోట్లు


