యమపాశాలుగా 'విద్యుత్‌ వైర్లు' | Over 900 deaths due to electrical accidents in the state annually | Sakshi
Sakshi News home page

యమపాశాలుగా 'విద్యుత్‌ వైర్లు'

Sep 27 2026 6:01 AM | Updated on Sep 27 2026 6:01 AM

Over 900 deaths due to electrical accidents in the state annually

పొలాలు, ఇళ్ల మధ్య తెగి పడుతున్న విద్యుత్‌ తీగలు.. పెరుగుతున్న ప్రమాదాలు 

రాష్ట్రంలో ఏటా 900కుపైగా విద్యుత్‌ ప్రమాద మృతులు

గడిచిన రెండు రోజుల్లోనే వేర్వేరు ఘటనల్లో ఆరుగురు దుర్మరణం

రక్షణ వ్యవస్థలు లేని ట్రాన్స్‌ ఫార్మర్లు, పాత విద్యుత్‌ వైర్ల వల్ల ప్రమాదాలు 

నామమాత్రంగానే జరుగుతున్న విద్యుత్‌ భద్రత తనిఖీలు

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వెలుగులు ఇవ్వాల్సిన తీగలే ప్రాణాలు తీస్తున్నాయి. వర్షం, ఈదురుగాలులు వస్తే చాలు.. ఎక్కడ ఏ తీగ తెగిపడుతుందో.. ఎక్కడ ఏ స్తంభం విరిగిపడుతుందో.. ఎవరికి షాక్‌ కొడుతుందోనన్న ఆందోళన కలుగుతోంది. ఇళ్ల వద్ద నుంచి పొలాల వరకు, రోడ్ల నుంచి పండుగల మండపాల వరకు.. విద్యుత్‌ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రెండేళ్లుగా చోటుచేసుకున్న వరుస ఘటనలు ఈ ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. 

తెగిపడే వైర్లు, ఎక్కడికక్కడ వేలాడే లైన్లు, రక్షణ వ్యవస్థలు లేని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాల్లో లోపాలు, నామమాత్రంగానే జరుగుతున్న విద్యుత్‌ భద్రత తనిఖీలు  ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి.  రాష్ట్రంలో ఏటా 900కుపైగా విద్యుత్‌ ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతుండగా, తాజాగా రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు విద్యుత్‌ తీగలు తెగిపడి వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.  ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమనే విమర్శలు బాధితుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

నివేదికలో విస్తుగొలిపే వాస్తవాలు 
»  కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ (సీఈఏ):  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 776 విద్యుత్‌ ప్రమాదాలు నమోదయ్యాయి. 426 మంది చనిపోయారు. వీటిలో కేవలం విద్యుత్‌ సంస్థల నిర్లక్ష్యం వల్ల మరణించిన వారి సంఖ్య 332. 
»   పార్లమెంటుకు కేంద్ర విద్యుత్‌ శాఖ గణాంకాలు:  తీగలు లేదా కండక్టర్లు తెగిపడటం వల్ల 2024–25లో 39 మంది మృతి చెందగా.. 2025–26లో ఈ మరణాలు 159కి ఎగబాకాయి. అంటే ఒక్క ఏడాదిలోనే మరణాల సంఖ్య భారీగా 120  పెరిగింది. పెరుగుదల సుమారు 308 శాతంగా నమోదయ్యింది.  
»  జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ): ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 900 విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదయ్యే విద్యుత్‌ ప్రమాదాల్లో అధిక శాతం 11 రాష్ట్రాల్లోనే జరుగుతుండగా వాటిలో ఏపీ కూడా ఉంది. 
»   కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ (సీఈఏ):  ఏడాదిలో సగటున రోజుకు ఇద్దరి కంటే ఎక్కువ మంది విద్యుత్‌ ప్రమాదాలకు బలయ్యారు. లైవ్‌ విద్యుత్‌ వైర్, పరికరాన్ని అనుకోకుండా తాకడం వల్లే 242 మంది మృతి చెందారు. ఇదే కేటగిరీలో 41 మంది గాయపడ్డారు. భద్రతా చర్యలను పాటించకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల మరో 17 మంది మృతి చెందారు. పరికరాల లోపాలతో 26 మంది, అనధికారిక పనులతో 23 మంది ప్రాణాలు వదిలారు. 111 పెంపుడు జంతువులు కూడా అసువులుబాసాయి. 
»  ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ అధ్యయనం: విద్యుత్‌ ప్రమాదాల్లో సుమారు 70 శాతం పంపిణీ స్థాయిలోనే జరుగుతున్నాయి.

కారణాలు ఏమిటి? 
»  పాత స్తంభాలు, వేలాడే తీగలు, రక్షణ పరికరాల కొరత వంటి సమస్యలు ప్రమాద తీవ్రతను పెంచుతున్నాయి. విద్యుత్‌ స్తంభాలు, తీగలు దెబ్బతిని, తెగిన తీగలు నీటిలో పడి ప్రాణాంతకంగా మారుతున్నాయి.  
»    బోర్‌వెల్‌ విద్యుత్‌ పరికరాల్లో లోపాలు, సరైన ఎర్తింగ్‌ లేకపోవడం, అనధికార విద్యుత్‌ కంచెలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.  
»  పండుగల సమయంలో టెంట్లు, ఇనుప జెండా కర్రలు, బ్యానర్లు విద్యుత్‌ తీగలకు సమీపంగా ఏర్పాటు చేయడం కూడా ముప్పుగా మారుతోంది.  
»   రోడ్లు, పొలాలు, ఇళ్ల పరిసరాల్లో లైన్లు తెగిపడినప్పుడు అవి లైవ్‌లో (విద్యుత్‌ ప్రసారం) ఉన్నాయా లేదా అన్నది సాధారణ ప్రజలకు తెలియదు. విద్యుత్‌ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదు. వర్షపు నీటిలో పడిన తీగ మరింత ప్రమాదకరం. ముందస్తు తనిఖీలు, దెబ్బతిన్న స్తంభాలు, తీగల మార్పు, భద్రతా చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం ప్రమాదాల తీవ్రతను పెంచుతోంది. 
»  వారంలో ఒక రోజు విద్యుత్‌ లైన్ల తనిఖీలు, నెలలో ఒకసారి సబ్‌ స్టేషన్‌ తనిఖీ పేరుతో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో ఫలితాలు సరిగా ఉండడం లేదు.  

కూటమి ప్రభుత్వంలో కొన్ని ఘోర విద్యుత్‌ ప్రమాదాలు
2024 
1. జూలై 23, 2024    – ప్రకాశం జిల్లా, కనిగిరి సమీపం, పునుగోడు: బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులపై హైటెన్షన్‌ విద్యుత్‌ తీగ తెగిపడటంతో ముగ్గురూ మృతి చెందారు.  
2. సెప్టెంబర్‌ 8, 2024 – పల్నాడు జిల్లా, పొట్లూరు: వినాయక మండపంలో లైట్లు ఏర్పాటు చేస్తుండగా లైవ్‌ వైర్‌ తగిలి 18 ఏళ్ల వేదసహాయం మృతి చెందాడు.  
3. అక్టోబర్‌ 20, 2024 – కాకినాడ జిల్లా, సామర్లకోట: టెర్రస్‌పై బట్టలు ఆరేస్తుండగా అక్కడున్న విద్యుత్‌ వైర్‌ తగిలి తల్లి, కుమారుడు ఇద్దరూ మృతి చెందారు.  
4. నవంబర్‌ 4, 2024 – తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, తాడిపర్రు: విగ్రహావిష్కరణ కోసం ఫ్లెక్సీ కడుతుండగా లైవ్‌ వైర్‌ తగిలి నలుగురు యువకులు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.  

2025 
1. ఫిబ్రవరి 24, 2025 – గుంటూరు జిల్లా, పెదకాకాని: గోశాలలో సంపు శుభ్రం చేస్తూ మోటార్‌ను రిపేర్‌ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఒకరికి విద్యుత్‌ షాక్‌ తగిలింది. అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురూ షాక్‌కు గురయ్యారు. నలుగురూ ప్రాణాలు వదిలారు. 
2. మే 26, 2025 – శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలం, చిల్లపుట్టిగ: స్థానిక ఉత్సవాల్లో సీరియల్‌ లైటింగ్‌కు ఉపయోగించిన వైర్‌ తెగి రోడ్డుపై పడటంతో విద్యుదాఘాతం జరిగింది. ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.  
3. జూలై 6, 2025 – కర్నూలు జిల్లా, ఆదోని మండలం, పెద్దతుంబలం: ఇంటి నిర్మాణానికి నీరు పంప్‌ చేస్తుండగా మోటార్‌ను తాకిన 13 ఏళ్ల బాలుడు మహేష్‌ మృతి చెందాడు.  
4. ఆగస్టు 27, 2025 – కాకినాడ: వాలీబాల్‌ ఆడేందుకు పోల్స్‌ ఏర్పాటు చేస్తుండగా లైవ్‌ వైర్‌ తగిలి 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మరో ఐదుగురు గాయపడ్డారు.  
5. డిసెంబర్‌ 1, 2025 – ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం, కొత్త అన్నసముద్రం: ఐదుగురికి విద్యుత్‌ షాక్‌ తగలగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

2026 
1. జనవరి 25, 2026 – నెల్లూరు జిల్లా, వరికుంటపాడు మండలం, బోనిగర్లపాడు: పంటను జంతువుల నుంచి రక్షించేందుకు పొలం చుట్టూ అక్రమంగా ఏర్పాటు చేసిన లైవ్‌ విద్యుత్‌ కంచెను తాకి 18 ఏళ్ల ఇద్దరు యువకులు మృతి చెందారు.  
2. మార్చి 30, 2026 – అనంతపురం: కోవ్వూరు నగర సచివాలయానికి చెందిన ఎనర్జీ అసిస్టెంట్‌ వెంగముని ఏఖీ లైవ్‌ వైర్‌కు తగిలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు వదిలాడు. 
3. ఏప్రిల్‌ 4, 2026 – పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, మామిడిపల్లి: గోడ ఎక్కే సమయంలో పంప్‌సెట్‌ ఎలక్ట్రికల్‌ ప్యానెల్‌ను పట్టుకోవడంతో 9వ తరగతి విద్యార్థి మృతి చెందాడు.  
4. మే 28, 2026 – కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలం, లంకపల్లి: భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్‌ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. లంకపల్లిలో నీరు తీసుకునేందుకు వెళ్లిన ఇంటర్‌ విద్యార్థిని విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందింది. మరో వ్యక్తి విద్యుత్‌ తీగ కారణంగా మృతి చెందాడు.  
5. జూన్‌ 21, 2026 – విశాఖపట్నం, మధురవాడ: రోడ్డుపై క్రికెట్‌ ఆడుతున్న 6 ఏళ్ల బాలుడు, బంతి తీసుకునే క్రమంలో బయటకు వేలాడుతున్న ఎర్తింగ్‌ వైర్‌ను తాకి మృతి చెందాడు. ఆ ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ పనుల సమయంలో వైర్‌ బయటకు వచ్చి వేలాడుతూ ఉండటం ప్రమాదానికి కారణమైంది. 
6. జూలై 3, 2026 – వైఎస్సార్‌ కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, దొరసానిపల్లె: ఓ వ్యక్తి విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసు­లు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. 
7. సెప్టెంబర్‌ 24, 2026 – అనకాపల్లి జిల్లా, నాతవరం మండలం, గొల్లవీధి: భారీ వర్షాల సమయంలో ఇంటి పైభాగం నుంచి వేలాడుతున్న సపోర్ట్‌ వైర్‌ను తాకడంతో తల్లీకూతురు మృతి చెందారు. భర్త నాగరాజు వైర్‌ను తొలగించేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై గాయపడ్డాడు.  
8. సెప్టెంబర్‌ 24, 2026 – పశ్చిమగోదావరి జిల్లా, పెంటపాడు మండలం, జట్లపాలెం: ఎనిమిదవ తరగతి, ఆరవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు ఆడుకుంటూ అక్కడున్న ఎర్త్‌ వైర్‌ను తాకడంతో విద్యుత్‌ షాక్‌కు గురై చనిపోయారు. 
9. సెప్టెంబర్‌ 24, 2026 – బాపట్ల జిల్లా, చెరువు ఉప్పరపాలెం: సరుకులు తెచ్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ మహిళ విద్యుత్‌ స్తంభం నుంచి తెగిపడిన వైరును తొక్కడంతో షాక్‌కు గురై మరణించింది. తల్లి షాక్‌కు గురవ్వడాన్ని గమనించి కాపాడేందుకు వచ్చిన ఆమె కుమారుడు కూడా అదే విద్యుత్‌ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement