ఈవెంట్ మేనేజ్‌మెంట్ పనులు నిర్వహించిన మాన్ డెకరేటర్స్
బకాయిల్లో కనీసం 50 శాతం మంజూరు చేయాలని అభ్యర్థన
దీంతో రూ.22.31 కోట్లు అదనపు నిధులు విడుదల
ఇందులో మాన్ డెకరేటర్స్‌కు రూ.11.71 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనల్లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ పనులకు భారీగా వ్యయం చేశారు. వివిధ జిల్లాల్లో సీఎం కార్యక్రమాలకు సంబంధించిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ పనులను మాన్ డెకరేటర్స్ సంస్థ నిర్వహించింది. ఇందుకోసం రూ.44.62కోట్లు ఖర్చుచేసినట్టు మాన్ డెకరేటర్స్ సంస్థ పేర్కొంది. తమకు చెల్లించాల్సిన బకాయిల్లో కనీసం 50 శాతం మంజూరు చేయాలని మాన్ డెకరేటర్స్ సాధారణ పరిపాలన శాఖను కోరింది. అలాగే, వివిధ జిల్లాల్లో సీఎం జరిపిన పర్యటనలకు సంబంధించిన ఖర్చుల నిమిత్తం బడ్జెట్ విడుదల చేయాలని కోరుతూ చిత్తూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, పల్నాడు, అనంతపురం, అంబేడ్కర్ కోనసీమ, అన్నమయ్య, తూర్పు గోదావరి, శ్రీసత్యసాయి, విజయనగరం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, కాకినాడ, తిరుపతి కలెక్టర్ల నుంచి వివిధ తేదీల్లో ప్రతిపాదనలు సాధారణ పరిపాలన శాఖకు అందాయి.
మాన్ డెకరేటర్స్‌కు సంబంధించి 50 శాతం నిధులను విడుదల చేయడానికి చేసిన అభ్యర్థన పరిశీలించిన తరువాత ఆర్థిక శాఖకు సాధారణ పరిపాలన శాఖ పంపింది. దీనిపై ఆర్థిక శాఖ బకాయి మొత్తంలో 50 శాతం మాన్ డెకరేటర్స్‌కు చెల్లించేలా రూ.22.31 కోట్ల అదనపు బడ్జెట్ నిధులు విడుదలకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ చెల్లింపులు షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ధరల పట్టిక) ఖరారు, చర్చలకు లోబడి, అలాగే 2026–27 ఆర్థిక సంవత్సరంలో తగిన సమయంలో అనుబంధ గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరే వరకు ట్రెజరీ నియంత్రణ, త్రైమాసిక నియంత్రణ ఉత్తర్వుల నుంచి మినహాయింపుతో చెల్లింపులకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. అయితే, మాన్ డెకరేటర్స్‌కు రూ.11.71 కోట్లు చెల్లించేందుకు పరిపాలన ఆమోదం తెలుపుతూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.


