మధ్యాహ్న భోజన సాంబారులో బల్లి | 19 female students fell seriously ill and vomited after eating a meal | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజన సాంబారులో బల్లి

Sep 27 2026 5:32 AM | Updated on Sep 27 2026 5:32 AM

19 female students fell seriously ill and vomited after eating a meal

19 మంది బాలికలకు అస్వస్థత 

తుని ప్రభుత్వ మహిళా జూనియర్‌ కాలేజీలో ఘటన

తుని: ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం సాంబారులో బల్లి పడి కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాల విద్యార్థినులు 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. విద్యార్థినులు తుని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మహిళా జూనియర్‌ కళాశాలకు మధ్యాహ్న భోజనాన్ని తొండంగి మండలం బెండపూడికి చెందిన అల్లూరి సీతారామరాజు ట్రస్టు శనివారం సరఫరా చేసింది. బాలికలు భోజనం చేస్తుండగా సాంబారులో బల్లి కనిపించింది. భోజనం తిన్న 19 మంది విద్యార్థినులు వాంతులు కావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

వీరిని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మహేష్‌ విద్యార్థినులను పరీక్షించారు. ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో సెలైన్లు ఎక్కించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారు. కళాశాల ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా బాధితులను ఆస్పత్రిలో చేర్పించి ఇంటికి వెళ్లిపోయారు. 19 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలైనా ప్రిన్సిపాల్‌ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా శాఖ ఉన్నతాధికారులూ దీనిపై స్పందించలేదు. మీడియాకు కనీస సమాచారం ఇవ్వలేదు.  

120 మంది విద్యార్థినులకు అస్వస్థత
తొండూరు అంబేడ్కర్‌ బాలికల 
గురుకుల పాఠశాలలో ఆహారం కలుషితం 
తొండూరు: వైఎస్సార్‌ కడప జిల్లా తొండూరులోని అంబేడ్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో 120 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తరువాత వీరందరికి వాంతులు, విరేచనాలు కావడంతో ఆహారం కలుషితమై ఉంటుందని భావిస్తున్నారు. వీరిలో 20 మందిని శనివారం తొండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మిగిలిన 100 మందికి స్థానిక వైద్యాధికారి గవాస్కర్‌రెడ్డి పాఠశాలలోనే వైద్య సేవలు అందించారు. ఈ ఘటనకు ముందు శుక్రవారం ఉదయం నులి పురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులు విద్యార్థినులతో ఆల్బెండజోల్‌ మాత్రలు మింగించారు. 

ఆహారం కలుషితం కావడానికి కేర్‌ టేకర్‌ అమ్ములు నిర్లక్ష్యమే కారణమని ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. మెను ప్రకారం కాకుండా కోడిగుడ్డు కూర వడ్డించారని, అది పాడై ఉంటుందని మండిపడ్డారు. పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య తొండూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రిన్సిపల్‌ ఉషారాణిని హెచ్చరించారు. కాంట్రాక్టర్‌ కూరగాయలు అందించకపోవడంతో కోడిగుడ్డు కూర వడ్డించినట్టు ఆమె తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement