సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ 52వ వార్డు అంబ్కేదర్‌నగర్‌లో శనివారం రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపులో విషాదం చోటుచేసుకుంది. డీజే మోత మధ్య ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఎన్‌ఏడీ ప్రాంతంలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించే ఆ వ్యక్తి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోయాడు. 108 సిబ్బంది పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
స్థానికులు ఇతడిని ఆర్ అండ్ బీ అని పిలుస్తుంటారు. పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. డీజే భారీ శబ్దం, వైబ్రేషన్ల కారణంగానే అతడు మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. అయితే మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదికలో తేలాల్సి ఉంది. మితిమీరిన శబ్ద కాలుష్యం... చిన్నారులు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోంది.
సాధారణంగా మనుషుల చెవులు 60 నుంచి 70 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని తట్టుకోగలవు. కానీ ఊరేగింపుల్లో వాడే డీజేలు 100 నుంచి 110 డెసిబెల్స్‌కుపైగా శబ్ద తీవ్రతను కలిగి ఉంటున్నాయి. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరో ఘటనలో
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం రాత్రి డీజే సౌండ్‌తో వినాయక విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. అదే సమయంలో ఇసుక తరలించే ఎడ్ల బండ్లు కూడా చెరువుకట్ట ప్రాంతానికి చేరుకున్నాయి.
ఈ క్రమంలో డీజే సౌండ్‌కు రెండు ఎద్దులు బెదిరి చెరువు కట్ట సమీపంలోని బృందావన్ కాల్వలోకి బండితో సహా దూకాయి. ఇది గమనించిన బండిపై ఉన్న వ్యక్తి ముందుగానే పక్కకు దూకాడు. ఎద్దులు పడిన చోట బురద ఉండటంతో వాటికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఊరేగింపుల సమయంలో డీజేలు ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రైలులో ఎంపీ భార్యకు ‘భయానక’ అనుభవం


