సచివాలయ ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కతోవ పట్టించే ఎత్తుగడ
ఆర్థిక ప్రయోజనాలు లేకుండా పదోన్నతులు అంటూ స్పష్టత లేని ఉత్తర్వులు
ఆరేళ్ల తర్వాత ప్రమోషన్ ఛానల్స్ అంటూ గొప్పలు
అమలు గడువు, సీనియారిటీ, పే ఫిక్సేషన్, జీతభత్యాలు, అరియర్స్ మాటేంటని ఉద్యోగులు ధ్వజం
సాక్షి, అమరావతి: కడుపు మండి రోడ్డెక్కిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను చంద్రబాబు సర్కారు బురిడీ కొట్టించేందుకు బరితెగించింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వారు కొన్నాళ్లుగా కోరుతున్నా, సర్కారు ఖాతరు చేయలేదు. దీంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆదివారం ‘చలో విజయవాడ’కు తరలివచ్చారు. పోలీసుల ఆంక్షలకు వెరవలేదు.. ధర్నాచౌక్‌లో లాఠీలు ఝళిపించినా భయపడలేదు. ధర్నా కొనసాగించారు. దీంతో ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ప్రభుత్వం పట్టణ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు అంటూ సవాలక్ష లోపాలతో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను చూసిన సచివాలయ ఉద్యోగులు సర్కారు మోసపూరిత విధానాలపై నిప్పులు చెరుగుతున్నారు.
కీలక అంశాలపై స్పష్టత ఏది?
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రమోషన్లకు సంబంధించి స్పష్టత లేదు. 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 1,630 గ్రేడ్–1 పోస్టులు ఏర్పాటు చేసినా.. అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు ఎప్పటిలోగా ఇస్తారో ఉత్తర్వుల్లో చెప్పలేదు. పే ఫిక్సేషన్‌పై స్పష్టత లేదు. ఒక కేడర్ నుంచి మరో కేడర్‌కు ప్రమోషన్ వచ్చినప్పుడు జీతాన్ని ఏ విధంగా నిర్ణయిస్తారో పేర్కొనలేదు.
జీతం పెరుగుదలపై క్లారిటీ ఎక్కడ?
ప్రమోషన్ వచ్చిన ఉద్యోగికి జీతం ఎంత పెరుగుతుంది? అదనపు ఇంక్రిమెంట్ ఇస్తారా? గ్రేడ్–1కి వెళ్లినప్పుడు వేతన ప్రయోజనం ఉంటుందా? అన్న వివరాలు లేవు. అరియర్స్ ప్రస్తావన కూడా లేదు. 2019 నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు గత కాలానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు లేదా అరియర్స్ ఇస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు.
సీనియారిటీ నిర్ణయం ఎలా?
ప్రమోషన్ల సమయంలో నియామక తేదీ, కేడర్‌లో సీనియారిటీ, రోస్టర్ తదితర అంశాల్లో దేనిని ప్రాతిపదికగా తీసుకుంటారో స్పష్టం చేయలేదు. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత ఏర్పడే ఖాళీల ఆధారంగా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు అవకాశం కల్పించనున్నారు. దీంతో ఒక దశ పూర్తయిన తర్వాతే మరో దశ మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. అది కూడా ఎంత కాలం పడుతుందో తెలియని పరిస్థితి.
శానిటేషన్, ప్లానింగ్ కేడర్లలో 815 చొప్పున పోస్టులను గ్రేడ్–1కు అప్‌గ్రేడ్ చేశారు. అయితే వీటికి ప్రమోషన్లు ఎప్పుడు, ఏ విధంగా ఇస్తారన్నది స్పష్టంగా లేదు. ఉన్న ఖాళీల్లో మిగులు పోస్టులను సర్దుబాటు చేయడం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం ఉండదని చెబుతున్నారు. అయితే ప్రమోషన్ పొందిన ఉద్యోగులకు వేతనపరంగా ఎలాంటి ప్రయోజనం కల్పిస్తారన్నది ఉత్తర్వుల్లో వివరించలేదు.
రెండు కేటగిరీల ఊసే లేదు
వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్, వార్డు అమెనిటీస్ సెక్రటరీల ప్రమోషన్లపై సంబంధిత శాఖల సిఫార్సులు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఈ ఉద్యోగులకు ఇంకా స్పష్టమైన గడువు తెలుపలేదు. హడావుడిగా ఉద్యోగుల హోదాలు, బాధ్యతలను మార్చే అంశం ప్రస్తావించిన సర్కారు.. కొత్త జాబ్ చార్ట్, అధికారాలు, జవాబుదారీతనం, తదుపరి ప్రమోషన్‌కు అవసరమైన అర్హతలపై స్పష్టత ఇవ్వక పోవడంపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రమోషన్ల అమలు గడువు, సీనియారిటీ, పే ఫిక్సేషన్, జీతభత్యాలు, అరియర్స్‌పై స్పష్టమైన మార్గదర్శకాలు లేని ఈ ఉత్తర్వులు ఉత్తిత్తివేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


