ఉద్యోగుల పొట్ట కొడతారా! | Strong opposition to police action against protesters | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల పొట్ట కొడతారా!

Sep 28 2026 3:59 AM | Updated on Sep 28 2026 3:59 AM

Strong opposition to police action against protesters

పోలీస్‌స్టేషన్లలో నిర్బంధానికి గురైన గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులను టాయిలెట్స్‌కు కూడా వెళ్లనీయలేదు  

అనారోగ్యంతో ఉన్నవారు మందులు తెచ్చుకుంటామని మొరపెట్టుకున్నా కనికరంలేదు 

చంద్రబాబు ఆదేశాలతో ఆందోళనకారులపై పేట్రేగిపోతున్న పోలీసుల తీరుపై తీవ్ర వ్యతిరేకత

ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు.. అరెస్టులు.. బెదిరింపులు.. దాడులు

సాక్షి, అమరావతి : పొట్టకూటి కోసం పోలీస్‌ ఉద్యోగం చేస్తున్న వారు చంద్రబాబు ఆదేశాలతో తోటి ప్రభుత్వోద్యోగుల పొట్టలు కొట్టేలా ఉక్కుపాదం మోపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అక్రమాలు.. వైఫల్యాలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నుంచి ఉద్యోగుల వరకు చేస్తున్న వరుస ఉద్యమాలపై పోలీస్‌ బలాన్ని ప్రయోగిస్తున్న చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. రెడ్‌బుక్‌ పాలనలో ప్రభుత్వం చెప్పిందే తరువాయి కొందరు పోలీసులు పేట్రేగిపోయి భయోత్పాతం సృష్టిస్తున్నారు. 

విజయవాడ ధర్నాచౌక్‌లో ఆదివారం భారీ నిరసన చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుషంగా ఉంది.  సచివాలయ ఉద్యోగులపై విరుచుకుపడి తమ ప్రతాపం చూపించారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసులే జుట్టుపట్టి ఈడ్చేసి కర్కశంగా ప్రవర్తించారు. చివరికి.. వివిధ పోలీస్‌స్టేషన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు నిర్బంధానికి గురైన మహిళా ఉద్యోగులను టాయిలెట్స్‌కు కూడా అనుమతించలేదు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారిని మందులు తెచ్చుకుంటామని మొరపెట్టుకున్నా కనికరించకుండా రాక్షసంగా వ్యవహరించారు. 

భోజనం కూడా పెట్టని పోలీసులు 
విజయవాడ గాంధీనగర్‌ ధర్నాచౌక్‌కు చేరుకున్న ఉద్యోగులపట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించడంతో తోపులాటలు జరిగాయి. మహిళా ఉద్యోగులను మగ పోలీసులు ఈడ్చేసి మరీ పోలీసు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు. మహిళా సిబ్బందిని నున్న, సింగ్‌నగర్, మాచవరం, కృష్ణలంక, ఉయ్యూరు తదితర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. క్రిమినల్స్‌ను చూసినట్లు వారిపట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. వారికి భోజనం కూడా పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేశారు. 

మాచవరం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సచివాలయ ఉద్యోగుల­కు భోజనం తీసుకెళ్లిన ఉద్యోగుల సంఘ నేత కాకర్ల వెంకట్రామిరెడ్డిని పోలీసులు అనుమతించలేదు. దీంతో తాము తెచ్చిన భోజనమైనా ఉద్యోగులకు అందించండి? లేకుంటే మీరైనా భోజనం పెట్టండి అంటూ వెంకట్రామిరెడ్డి పోలీసులను కోరారు. అయినా పట్టించుకోని పోలీసులు భోజనాన్ని సచివాలయ ఉద్యోగులకు పెట్టకుండానే రాక్షసంగా వ్యవహరించారు.  

ఆ ఇద్దరి మరణాలు సర్కారు హత్యలే.. 
ఇక చంద్రబాబు ప్రభుత్వ తీవ్ర నిర్బంధం కారణంగానే వైఎస్సార్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్, తాజాగా ఆదివారం విజయవాడ నున్న సీఐ అహ్మద్‌ అలీ మృతిచెందారు. ఈ రెండు ఘటనలు సర్కారు హత్యలేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ చేయాలని, నైతిక బాధ్యత వహించి లోకేశ్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 21న విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆ పార్టీ నేత, లిడ్‌ క్యాప్‌ మాజీ చైర్మన్‌ కానుమాను రాజశేఖర్‌పై పోలీసులు దాడిచేయడంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురై కిందపడిపోయారు. 

తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి మానసికంగా వేధించడంతో తీవ్ర ఒత్తిడికి గురై చివరికి గుండెపోటుతో మృతిచెందారు.  ఇప్పుడు విజయవాడ ధర్నాచౌక్‌లో ఆదివారం సచివాలయ ఉద్యోగుల ఆందోళనను భగ్నం చేయడానికి విధులు నిర్వర్తిస్తున్న నున్న సీఐ అహ్మద్‌ అలీ గుండెపోటుకు గురయ్యారు. ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. చంద్రబాబు ప్రభుత్వ తీవ్ర ఒత్తిడివల్లే సీఐ గుండెపోటుకు గురయ్యారని సహచర పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇదే ధర్నాలో పోలీసుల దాడులు, దౌర్జన్యాలకు అనేక మంది సచివాలయ ఉద్యోగులు సొమ్మసిల్లి పడిపోవడం, గాయాలపాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement