చంద్రబాబు పాలనలో ఒక్క బీసీకీ న్యాయం జరగలేదు
బీసీ మహిళలకు చేయూత ఇస్తామని నిలువునా మోసం చేశారు
50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ముంచేశారు
బలహీన వర్గాలను బ్యాక్ బోన్‌గా గుర్తించింది వైఎస్ జగనే
వైఎస్ జగన్ గెలుపుతోనే బీసీలకు మంచి రోజులు
వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీల గర్జనలో వైఎస్సార్‌సీపీ నాయకులు
సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడం వల్లే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నాడని వైఎస్సార్‌సీపీ బీసీ నాయకులు ధ్వజమెత్తారు. సత్తా ఉంటే ఆ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, కేంద్రంలోనూ ఎన్‌డీఏ ప్రభుత్వమే ఉన్నందున పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన వెన్నుపోటు పార్టీ వంచనపై ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని బీసీల గర్జన సదస్సు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాతేరులో ఆదివారం నిర్వహించారు.
బీసీలకు ఏం చేశారో చెప్పాలి: బొత్స
శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలో బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బ్యాక్ బోన్ అని గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్ వారిని ప్రోత్సహించి ప్రాధాన్యమిచ్చారని గుర్తుచేశారు. ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎంలను చేశారని కొనియాడారు. చంద్రబాబు మాత్రం స్వలాభం కోసం అప్పులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అందరం ఐక్యంగా పోరాడదామని బొత్స పిలుపునిచ్చారు.
బీసీల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాటం: చెల్లుబోయిన
బలహీన వర్గాలను చంద్రబాబు నిత్యం మోసం చేస్తున్నారని మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్య క్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల కోసమే 34 శాతం రిజర్వేషన్ డ్రామాలాడుతున్నాడని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రిని చేసేందుకు ఒక్క బీసీ ఎమ్మెల్యే దొరకలేదా అని ప్రశ్నించారు.
పవన్‌కళ్యాణ్ పక్కన కూర్చునేందుకు బీసీలకు అర్హత లేదా అని నిలదీశారు. బీసీలను నేటికీ కులవృత్తిదారులుగానే బాబు చూస్తున్నారని, ఆదరణ పథకం కోసం రూ.3 వేల కోట్లు కేటాయించామని చెబుతున్నా నేటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని చెప్పారు. చేయూత పేరిట మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని, రుణాల కోసం 3 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కరికీ మంజూరు చేయలేదని మండిపడ్డారు. కుట్టుశిక్షణ తీసుకున్న మహిళలకు మెషిన్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు.
క్రెడిట్ చోరీయే చంద్రబాబు పని: మాజీ మంత్రులు
మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. హాస్టళ్లలో సరైన వసతులులేక బీసీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో టార్చ్‌లైట్ల వెలుగుల్లో ఆపరేషన్లు చేసే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో బీసీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారన్నారు.
ఇంకెంతకాలం ఇలాంటి పాలన భరిస్తామని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో గత సీఎం వైఎస్ జగన్ వసతులు కల్పించి అభివృద్ధి చేస్తే చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ బాబు ప్రైవేటుపరం చేసేవాడన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను దూరం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి బీసీల అభ్యున్నతికి పాటుపడిన బీసీల ఆత్మబంధువు జగన్ అని కొనియాడారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని గోదావరిలో కలిపేస్తాం
మాజీ మంత్రులు జోగి రమేష్, విడదల రజని, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వాన్ని గోదావరిలో కలిపేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించే సత్తా చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికలొచ్చినప్పుడే ఆదరణ, ముందడుగు అంటూ డ్రామాలాడుతున్నాడని మండిపడ్డారు. బీసీల రక్షణకు చట్టం తీసుకొస్తామని మాయ చేశారన్నారు. మహాత్మా జ్యోతీరావు ఫూలే ఆశయాలను దివంగత మహానేత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణలో చేసి చూపించారని కొనియాడారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు తండ్రీకొడుకులు బాటలు వేశారని గుర్తుచేశారు. బీసీలకు ఉప ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా అవకాశమిచ్చింది వైఎస్ జగనే అన్నారు. 2029లో జగన్‌ను సీఎంను చేసుకునేందుకు ఐక్యంగా కృషి చేద్దామన్నారు. బీసీలకు వైఎస్ జగన్ చేసిన మేలును అందరికీ వివరిద్దామన్నారు. వివిధ అంశాలపై సదస్సులో తీర్మానాలు చేశారు.
బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, మాజీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, రౌతు సూర్యప్రకాశరావు, కడుబండి శ్రీనివాసరావు, పార్లమెంటరీ కో–ఆర్డినేటర్లు గూడూరి శ్రీనివాస్, గూడూరి ఉమాబాల, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదా వరి జిల్లాల బీసీ సెల్ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్లు పాల్గొన్నారు.


