గొల్లప్రోలు మండలం చందుర్తి వద్ద పోలవరం కాలువ గట్టుపై తవ్వకాలు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలవరం కాలువ కట్టలకు తూట్లు
పోలవరం కాలువ మట్టిని తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్న వైనం
ఒక్కో ప్రాంతంలో ఒక్కో నేత పాగా వేసి గ్రావెల్ అక్రమ రవాణా
ప్రతిరోజు వందలాది లారీల్లో ప్రైవేట్ లే–అవుట్లు, రహదారి పనులకు తరలింపు
కన్నెత్తి చూడని మైనింగ్ అధికారులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ కూటమి ‘కట్ట’ప్పలు మైనింగ్ మాఫియా అవతారమెత్తి చెలరేగిపోతున్నారు. టీడీపీ, జనసేన నేతల నేతృత్వంలో ‘ఆ ఊరు నీది.. ఈ ఊరు నాది’ అని పంపకాలు వేసుకుని మరీ ప్రాంతాల వారీగా పాగావేసి గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. అడ్డూ అదుపూ లేకుండా పోలవరం కట్ట(గట్ల)లను గుల్ల చేసేస్తూ గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలించుకుపోతున్నారు. తద్వారా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కేవలం ఒక్క పోలవరం గట్ల నుంచి తరలించిన మట్టి విలువే సుమారు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పైగా ఉంటుందన్న ఆరోపణలున్నాయి.
పోలవరం కాలువపై కన్ను
పోలవరం ఎడమ కాలువ పనులు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో చేపట్టారు. కాలువ తవ్వకాల సమయంలో భారీ స్థాయిలో మట్టి సమకూరింది. మట్టిపై కూటమి నేతలు కన్నేశారు. అక్రమ దందాకు దిగారు. పోలవరం కాలువ గట్లను, గట్ల పక్కన నిల్వ ఉంచిన మట్టిని రాత్రి, పగలు అన్న తేడా లేకుండా తరలించేస్తున్నారు. కాలువకు ఇరువైపులా 30, 40 అడుగుల ఎత్తున ఉన్న గట్లను ఇష్టారాజ్యంగా తవ్వి, తరలించేస్తున్నారు.
భారీ యంత్రాలను వినియోగించి మట్టిని ప్రభుత్వ పనుల పేరుతో ప్రైవేటు లే–అవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. లారీ గ్రావెల్ దూరాన్ని బట్టి రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయిస్తున్నారు. తుని నియోజకవర్గంలోని తేటగుంట, శంఖవరం మండలం మండపం ప్రాంతాల్లో డంప్ చేసిన మట్టిని లారీల కొద్దీ తరలిపోతోంది. ఈ అక్రమ తంతు వెనుక ఓ టీడీపీ కీలక నేత ఉన్నట్టు సమాచారం. గోకవరం, జగ్గంపేట మండలాల పరిధిలో పోలవరం గట్లపై ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో మట్టి తవ్వేశారు.
పవన్ ఇలాకాలో..
డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో మట్టి మాఫియా బరితెగిస్తోంది. కొండలు, ఆధ్యాతి్మక క్షేత్రాలను సైతం వదలడం లేదు. గొల్లప్రోలు మండలం చందుర్తి సమీపంలోని పోలవరం గట్లను సైతం గుల్ల చేసేస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టి తరలించేస్తోంది. ఈ అక్రమ వ్యవహారం వెనుక జనసేన నేతలు కీలక భూమిక పోషిస్తున్నట్టు విమర్శలున్నాయి. దీంతో అధికారులు సైతం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పంపాకు గర్భశోకం
పంపా రిజర్వాయర్‌లో గ్రావెల్, మట్టిని కమర్షియల్ లే–అవుట్ల అభివృద్ధికి వినియోగిస్తూ రూ.లక్షల్లో వసూళ్లకు దిగారు. ఓ ప్రజాప్రతినిధి వెనుక ఉండి తన బినామీలతో పంపా రిజర్వాయర్‌లో మొక్కుబడిగా అనుమతులు తీసుకుని నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా తవ్వకాలు సాగించారు. పంపాలో మట్టిని తవ్వేందుకు అన్నవరానికి చెందిన కూటమి నేతలు బినామీల పేరుతో క్యూబిక్ మీటర్ రూపాయి చొప్పున 10 వేల క్యూబిక్ మీటర్ల వ్యవసాయ భూమి సారవంతం చేసుకునేందుకు మట్టిని తవ్వుకునేందుకు రాష్ట్ర సాగునీటి వనరుల శాఖ నుంచి అనుమతులు పొందారు.
నిబంధనలు తుంగలో తొక్కి ఎక్స్‌కవేటర్లు, పొక్లెయిన్లతో రోజుకి 100 నుంచి 120 లారీల వరకు మట్టిని గొల్లప్రోలు, చేబ్రోలు, తుని రూరల్, కాకినాడ తదితర ప్రాంతాల్లోని కమర్షియల్ లే–అవుట్లు, ఇటుక బట్టీలకు తరలించారు. లారీ మట్టిని రూ.5 వేల నుంచి రూ.10 వేల చొప్పున అమ్ముకుని రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇందులో సింహభాగం ఓ సీనియర్ ప్రజాప్రతినిధి జేబులోకి వెళ్లినట్టు విమర్శలున్నాయి.
అనుమతి కొంత.. తవ్వకాలు కొండంత
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మురారి, కలవచర్ల, గాదరాడ ప్రాంతాల్లోని పోలవరం గట్లను మాఫియా కరిగించేస్తోంది. పోలవరం గట్టు నుంచి రోడ్డు పనుల నిమిత్తం కేవలం 3 వేల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టిని తవి్వ, తరలించాల్సి ఉంది. నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలు వ్యవహారానికి తెరతీస్తున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 85 వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ఫ్లైవర్ పనులకు, మరో 85 వేల క్యూబిక్ మీటర్ల మట్టి ప్రైవేటు అవసరాలకు అక్రమంగా తరలించినట్టు విమర్శలున్నాయి.
చెరువులనూ చెరబట్టి..
కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండలో సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో సుడి చెరువులో నిబంధనలు అతిక్రమించి మట్టిని తరలించేశారు. వాస్తవానికి చెరువు పూడికతీత మీటర్ కంటే ఎక్కువ లోతు చెరువులో మట్టిని తవ్వకూడదన్నది నిబంధన. ఎటువంటి వాణిజ్య ప్రయోజనాలకూ మట్టిని తరలించకూడదు. కానీ టీడీపీ నేతలు ఇష్టానుసారంగా తవ్వకాలు సాగించేశారు. 60 నుంచి 100 అడుగుల లోతున తవ్వి తరలించేశారు. ప్రతి రోజూ 150 లారీలు, టిప్పర్లలో మట్టి అక్రమంగా తరలించి రోజుకు రూ.15 లక్షలకు పైగా దండుకుంటున్నారు.
నిద్ర నటిస్తున్న అధికారులు
గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతున్నా.. ఇరిగేషన్, మైనింగ్ అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని లారీలకు అనుమతులు తీసుకున్నారు? ఎన్ని లారీలు తరలించారు? కాలువ గట్టుపై ఏ మేరకు తవ్వకాలు చేపట్టారు? అని ఆరా తీయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు గట్టునే కొల్లగొడుతుంటే అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
నెలకు రూ.50 కోట్లకు పైగా దోపిడీ
ప్రభుత్వ స్థలాల్లో మట్టి తవ్వితే ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ప్రజా అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నల్లరేగడి మట్టిని కడియం, ఆలమూరు, రావులపాలెం ప్రాంతాల్లోని ఇటుక బట్టీలు, భవన సముదాయాల నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎత్తు చేసేందుకు తరలిస్తున్నారు. ఎర్రమట్టి అయితే కడియపులంకలోని నర్సరీలకు తరలిస్తున్నారు.
నల్లరేగడి, ఇసుక నేలల్లోని మట్టిని టిప్పర్‌కి రూ.10 వేలు, ఎర్ర మట్టి (గ్రావెల్) రూ.20 వేల నుంచి రూ.25 వేల చొప్పున విక్రయిస్తున్నారు. చెరువు మట్టి లారీకి రూ.3,500 తీసుకుంటున్నారు. ప్రతి రోజూ 500 లారీల మట్టి తరలుతోంది. ఇలా రోజుకు రూ.2 కోట్లకు పైగా అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నట్టు సమాచారం. నెలకు రూ.50 కోట్లకు పైగా ఆదాయం గడిస్తున్నట్టు విమర్శలున్నాయి.


