పోలీసుల అదుపులో గోడౌన్ కీపర్లు వినోద్, శేషు
ప్రధాన నిందితుడు మల్లేశ్‌తో వీరికి ఆర్థిక లావాదేవీలు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో మరో ఇద్దరి పాత్రను పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్‌కు ఆయుధాలు భద్రపరిచే ఇద్దరు గోడౌన్ కీపర్లు ప్రత్యక్షంగా సహకరించినట్లు ఆధారాలు లభించడంతో ఆయుధాల గోడౌన్ కీపర్లు వినోద్, శేషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లేశ్‌కు, వీరిద్దరికీ మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. మల్కాజ్‌గిరి పోలీసులు మల్లేశ్‌ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. పది రోజుల పోలీసు కస్టడీలో ఉన్న మల్లేశ్‌ను విచారించగా ఈ చోరీ వెనుక ఉన్న అంతర్గత సంబంధాలు, పక్కా వ్యూహం బయటపడ్డాయి. రేపటితో మల్లేశ్ కస్టడీ పూర్తికానుంది.
నాలుగు నెలల ముందే ప్లాన్..
ఆయుధాల చోరీకి మల్లేశ్ నాలుగు నెలల క్రితమే స్కెచ్ వేసినట్లు తేలింది. మల్లేశ్ సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న నలుగురు ఆర్మీ సిబ్బందితో నిరంతరం సంప్రదింపులు జరిపేవాడు. ఆదివారం రాత్రి 8 గంటలకే అక్కడి సీసీటీవీ కెమెరాలు నిలిపివేస్తారని, అలాగే ఆ రోజు గార్డుల పహారా కూడా తక్కువగా ఉంటుందని వారి ద్వారా మల్లేశ్ సమాచారం సేకరించాడు. జూన్ 30న ఉద్యోగ విరమణ పొందిన మల్లేశ్, తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులను ఇబ్బందుల్లోకి నెట్టాలనే కక్షతోనే ఆగస్టు 30వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఈ చోరీకి పాల్పడ్డాడు.
యాప్రాల్‌లోని ఒక రోడ్‌సైడ్ వ్యాపారి వద్ద రూ.150కి కొనుగోలు చేసిన ఒక ఇనుప రాడ్డు సహాయంతో ఆయుధాగారం (కోటే), మందుగుండు నిల్వ కేంద్రాల తాళాలను మల్లేశ్ పగులగొట్టాడు. 90 నిమిషాలపాటు శ్రమించి 12 తుపాకులు (ఏకే–203 రైఫిళ్లు, ఇన్సాస్ రైఫిల్, పిస్టళ్లు), 1,800కిపైగా బుల్లెట్లను ఇసుక బస్తాల్లో ప్యాక్ చేసి తరలించాడు.
ఆర్మీలో చేరకముందే మల్లేశ్‌కు నేరచరిత్ర ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. 2005లో అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో ఒక దొంగతనం కేసు, అలాగే 2007లో అమ్రాబాద్ పరిధిలో బంగారం, వెండి దొంగతనం కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. అయినప్పటికీ, 2010లో అతను ఆర్మీ ఉద్యోగానికి ఎలా ఎంపికయ్యాడనే కోణంలో మిలిటరీ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు విడివిడిగా లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.


