‘రెస్పెక్ట్‌’ రచ్చ.. క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్‌ | Karunanidhi Row: I apologise on his behalf Says CM Vijay | Sakshi
Sakshi News home page

‘రెస్పెక్ట్‌’ రచ్చ.. క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్‌

Aug 18 2026 8:38 AM | Updated on Aug 18 2026 8:38 AM

Karunanidhi Row: I apologise on his behalf Says CM Vijay

తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కేవలం పేరుతో సంబోధించడంపై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే పరిస్థితి చేజారిపోకుండా ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ రంగంలోకి దిగారు. తనదైన స్టైల్‌లో ఆ వివాదానికి ముగింపు పలికారు.

అసెంబ్లీలో ఆరోగ్య, రెవెన్యూ శాఖల పద్దులపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న నగదు పంపిణీ, ఓటుకు నోటు తరహా రాజకీయాలను ప్రస్తావిస్తూ మంత్రి రంజిత్‌ కుమార్‌ డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచేవారని, తన కాంచీపురం నియోజకవర్గంలో ఒక్కో ఓటుకు రూ.1,500 వరకు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గతంలో అమలైన ఎన్నికల వ్యూహాలను ప్రస్తావిస్తూ.. డీఎంకే వ్యవస్థాపక నేతల్లో ఒకరైన, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని మంత్రి కేవలం పేరుతోనే సంబోధించారు. సాధారణంగా తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధిని ‘కలైంజర్‌’, ‘మాజీ ముఖ్యమంత్రి’ వంటి గౌరవప్రదమైన సంబోధనలతో ప్రస్తావించే సంప్రదాయం ఉంది. దీంతో డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

మంత్రి ఆర్‌వీ రంజిత్‌ కుమార్‌ తన ప్రసంగంలో కరుణానిధిని ఎలాంటి గౌరవప్రదమైన బిరుదు లేకుండా పేరుతో ప్రస్తావించడంతో డీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ నేతృత్వంలో డీఎంకే సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ స్వయంగా జోక్యం చేసుకున్నారు.  

కరుణానిధిని ఆ విధంగా సంబోధించడం సరైనది కాదని అంగీకరించిన ఆయన.. ‘‘ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను’’ అని ప్రకటించారు. సీఎం జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మంత్రి మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే మంత్రి బదులు సీఎం విజయ్‌ క్షమాపణలు చెప్పడాన్ని ఓ వర్గం అభినందిస్తుండగా.. ఆ క్షమాపణ ఏదో మంత్రితో చెప్పిచ్చి ఉంటే బాగుండేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement