బీజేపీ జాతీయ కార్యవర్గం భారీ ప్రక్షాళన
రాంమాధవ్, స్మృతీ ఇరానీ రీఎంట్రీ
తెలంగాణకు లభించని ప్రాతినిధ్యం.. ఏపీ నుంచి ఇద్దరికి చోటు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు ప్రాధాన్యం
సీనియర్లతోపాటు యువత, మహిళలకు పెద్దపీట
నూతన బృందానికి ప్రధాని మోదీ అభినందనలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ తొలిసారి అత్యంత కీలకమైన జాతీయ కార్యవర్గంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 65 మందితో సోమవారం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లతోపాటు యువత, మహిళలకు పెద్దపీట వేశారు. ఇందులో 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 16 మందిని జాతీయ కార్యదర్శులుగా నియమించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూలాలున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాంమాధవ్‌ను ఢిల్లీ కోటాలో జాతీయ ఉపాధ్యక్ష పదవి అప్పగించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలా వారిద్దరూ జాతీయ కార్యవర్గంలో పునఃప్రవేశించారు. అయితే తెలంగాణ నుంచి ఏ ఒక్కరికీ చోటుదక్కలేదు.
ఇప్పటివరకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన డీకే అరుణకు కొత్త జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి ఈ జాబితాలో స్థానం లభించింది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమితులవగా ఇప్పటివరకూ బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డికి జాతీయ కార్యవర్గంలో అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్తగా అవకాశం లభించింది.
సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు...
మహారాష్ట్రకు చెందిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రులైన విప్లవ్ కుమార్ దేవ్ (త్రిపుర)కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తీరత్‌సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), వసుంధర రాజే సింధియా (రాజస్తాన్)లకు జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. వైజయంత్ జైపాండా (ఒడిశా), రేఖా వర్మ (ఉత్తరప్రదేశ్), తారిఖ్ మన్సూర్ (ఉత్తరప్రదేశ్) తమ జాతీయ ఉపాధ్యక్ష పదవులను నిలుపుకున్నారు.
వినోద్ తావ్డే (మహారాష్ట్ర), సునీల్ బన్సల్ (ఢిల్లీ) జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగనున్నారు. కేరళంకు చెందిన అనిల్ ఆంటోని జాతీయ కార్యదర్శిగా, ఉత్తరాఖండ్‌కు చెందిన అనిల్ బలూని కీలకమైన జాతీయ మీడియా సమన్వయకర్తగా బాధ్యతలను కొనసాగించనున్నారు. మరికొందరు నాయకులకు సైతం పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు లభించింది. నూతనంగా నియమితులైన పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.


