ఎత్తయిన ఏనుగుపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు! | SC Orders Kerala Govt To Take Custody Of States Tallest Elephant Raman, Cites Animal Welfare Concerns | Sakshi
Sakshi News home page

ఎత్తయిన ఏనుగుపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు!

Jun 11 2026 8:39 AM | Updated on Jun 11 2026 9:13 AM

SC Orders Kerala Govt to Take Custody of States Tallest Elephant Raman

న్యూఢిల్లీ: కేరళలోనే అత్యంత  ఎత్తయిన ఏనుగుగా పేరొందిన ‘రామన్’ సంరక్షణపై దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) కీలక నిర్ణయం తీసుకుంది. నోరులేని మూగజీవాల సంక్షేమమే పరమావధి అని స్పష్టం చేస్తూ, రామన్‌ను తక్షణమే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపి, రామన్‌ను ఒక సరైన పునరావాస కేంద్రానికి తరలించాలని స్పష్టం చేసింది.

కోర్టు ధిక్కరణ..వాణిజ్య దోపిడీ 
గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ రామన్ ఏనుగును వాణిజ్య అవసరాలకు, ఉత్సవాలు, వివిధ ఆచారాల ఊరేగింపుల కోసం విపరీతంగా ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ, ఏనుగును నిర్బంధంలో ఉంచిన కృష్ణన్‌కుట్టి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ క్రమంలోనే అతనికి రూ. 2,000 జరిమానా కూడా విధించింది. నోరులేని మూగజీవాల పట్ల జరుగుతున్న ఇటువంటి ఉల్లంఘనలపై తాము కళ్లు మూసుకుని కూర్చోలేమని, మూగ ప్రాణుల సంక్షేమం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మాతా అమృతానందమయి మఠంతో.. 
జయకృష్ణ మీనన్ అనే వ్యక్తి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ఆధారంగా ఈ విచారణ జరిగింది. పిటిషనర్ వాదనల ప్రకారం.. ఈ రామన్ ఏనుగు వాస్తవానికి 'మాతా అమృతానందమయి మఠం'నకు చెందినది. దాని సంరక్షణ, నిర్వహణ బాధ్యతల కోసం మాత్రమే తాత్కాలికంగా కృష్ణన్‌కుట్టి అనే వ్యక్తికి అప్పగించడం జరిగింది. అయితే, కృష్ణన్‌కుట్టి  ఒక వివాదాస్పద విలునామా (ఉయిల్), గిఫ్ట్ డీడ్స్ ఆధారంగా ఈ ఏనుగు చట్టబద్ధంగా తనకే దక్కిందని, గత 10-12 ఏళ్లుగా తానే దాన్ని నిరంతరాయంగా పోషిస్తున్నానని కోర్టుకు తెలిపాడు.

కేరళ ప్రభుత్వానికి తాత్కాలిక బాధ్యతలు
ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్వాధీన ఆదేశాలు కేవలం తాత్కాలికమైనవని, కోర్టు వెలువరించే తుది తీర్పునకు ఇవి లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 లోని చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ఈ ఏనుగును తాత్కాలికంగా సంరక్షించాలని, ఇందుకు అవసరమైన పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేయవచ్చని పేర్కొంది. మరోవైపు, ఏనుగుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించిన కేరళ రాష్ట్ర అధికారులను కోర్టు ధిక్కరణ ఆరోపణల నుండి న్యాయస్థానం విముక్తి కల్పించింది.

ఇది కూడా చదవండి: ‘దీదీ’కి భారీ షాక్: ఢిల్లీలో టీఎంసీ ఆఫీస్ ఖాళీ

Advertisement
 
Advertisement
Advertisement