రూ. 954 కోట్ల స్కాం :భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్‌ | 100 Million USD fraud Indian Origin Financier Mahender Makhijani arrestv | Sakshi
Sakshi News home page

రూ. 954 కోట్ల స్కాం : భారత సంతతి వ్యాపారవేత్త అరెస్ట్‌

Jun 11 2026 12:20 PM | Updated on Jun 11 2026 12:54 PM

100 Million USD fraud Indian Origin Financier Mahender Makhijani arrestv

సుమారు రూ. 954 కోట్లకు పైగా కుంభకోణ ఆరోపణలతో 44 ఏళ్ల భారత సంతతి వ్యాపారవేత్త మహేందర్ మఖిజాని అమెరికాలో అరెస్టు చేశారు. బుధవారం ఉదయం న్యూపోర్ట్ బీచ్‌లోని అతని విలాసవంతమైన భవనంలో అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే అతనికి గరిష్టంగా 30 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మఖిజాని తన కంపెనీ (క్యాంటర్ గ్రూప్ V LLC) ద్వారా రియల్ ఎస్టేట్ లోన్ల కోసం తాకట్టు పెట్టిన ఆస్తుల విలువను పెంచి చూపారు. టైటిల్ ఇన్సూరెన్స్ పాలసీలను ఫోర్జరీ చేసి, మెటాడేటాను మార్చడం ద్వారా అసలు అప్పులను దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

కరోనా డెల్ మార్‌లో నివసిస్తున్నగ్రీన్ కార్డ్ హోల్డర్ మహేందర్ మఖిజానిని, ఒక బ్యాంకును దాదాపు 100 మిలియన్ డాలర్ల మేర మోసం చేసినట్లు వచ్చిన ఫెడరల్ క్రిమినల్ ఫిర్యాదు ఆధారంగా బుధవారం ఉదయం అరెస్ట్ చేశామని  సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా ఫస్ట్ అసిస్టెంట్ యూఎస్ అటార్నీ బిలాల్ ఎస్సాయిలీ తెలిపారు. తమ స్పెషల్ ఏజెంట్లు వివిధ ఖాతాల ద్వారా జరిగిన నిధుల బదిలీలను నిశితంగా పరిశీలించి, ఈ భారీ కుంభకోణాన్ని ఛేదించారు. సొంత లాభం కోసం పత్రాలను తారుమారు చేసి, ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేసే వారిని వదిలిపెట్టేది లేదు. నిజాలను వెలికితీసి,  చట్టానికి అప్పగిస్తామన్నారు.

ఐఆర్‌ఎస్‌ ప్రకారం మఖిజాని టైటిల్ ఇన్సూరెన్స్ రికార్డులను తప్పుగా సృష్టించాడు,నిజమైన తాకట్టు స్థానాలను దాచిపెట్టాడు. ఫెడరల్ ఇన్సూరెన్స్ ఉన్న ఒక బ్యాంకును తప్పుదోవ పట్టించడానికి షెల్ కంపెనీల నెట్‌వర్క్‌ను ఉపయోగించాడు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఒక సంపన్న ప్రాంతంలో హోటళ్లు, ఒక రెస్టారెంట్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి సాయుధ గుండాలను పంపడం, డ్రగ్స్ , సెక్స్ పార్టీలను నిర్వహించడం వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా ఇతనిపై ఉన్నాయి. 2024 సెప్టెంబర్- 2025 ఏప్రిల్ 2025 వరకు, మఖిజాని భీమా పత్రాలను ఫోర్జరీ చేసి, తాకట్టు పెట్టిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులపై కాంటర్ సంస్థకే మొదటి హక్కు (First Lien Position) ఉన్నట్లు చూపించాడు. ఈ నకిలీ పత్రాలను తన ఉద్యోగి ద్వారా బ్యాంకుకు సమర్పించేలా చేశాడు. అంతేకాకుండా, బ్యాంకు ప్రతినిధులతో ఫోన్ కాల్స్‌లో మాట్లాడుతూ, బ్యాంకు గుర్తించిన పత్రాల లోపాల గురించి అబద్ధాలు చెప్పి నమ్మించాడు.

సెక్స్ వర్కర్లతో ప్రైవేట్ పార్టీలను నిర్వహించేవాడని, ఈ పార్టీలకు కొంతమంది బ్యాంకు ఉద్యోగులు కూడా హాజరయ్యారని కోర్టు పత్రాల ద్వారా తెలుస్తోంది. ఆ పార్టీలలో జరిగిన ఉదంతాల ఆధారంగా అతను బ్యాంకు సిబ్బందిని, తన భాగస్వాములను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ తన నియంత్రణలో ఉంచుకున్నాడు. అంతేకాదు తన కింద పనిచేసే సిబ్బందిని బెదిరిస్తూ,  తనకు వ్యతిరేకంగా పనిచేస్తే,  చంపేస్తామని,  కుటుంబాలను, పిల్లల్ని రోడ్డు పడేస్తానని బెదిరించేవాడు.

అలాగే గత నెలలో జరిగిన ఒక మధ్యవర్తిత్వ విచారణలో వ్యాపారవేత్త మొహమ్మద్ హోనార్కర్‌తో జరిపిన రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మఖిజాని అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. దీనికిగాను  సుమారు రూ. 12,391.6 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement