హన్సి: హర్యానాలోని హన్సి జిల్లాలో ఒక జిమ్ యజమానిని గుర్తుతెలియని దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపి పారిపోయారు. కేవలం ఐదు సెకన్ల వ్యవధిలోనే పది రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఫవ్వారా చౌక్ సమీపంలో గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మృతుడిని కపిల్‌గా గుర్తించారు.
ఆయన తన ఫిట్‌నెస్ సెంటర్ వెలుపల వ్యాయామం చేయిస్తున్న సమయంలో, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. హెల్మెట్లు, మాస్కులు ధరించిన ఆ నిందితులు అత్యంత సమీపం నుండి కేవలం ఐదు సెకన్లలో 10 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో కపిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో శిఖ అనే మహిళ కూడా గాయపడగా, ఆమెను చికిత్స నిమిత్తం హిసార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుల ఆనవాళ్లను గుర్తించేందుకు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు సైతం ఆధారాలు సేకరించాయి. ఈ కేసు దర్యాప్తును హర్యానా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ)కి అప్పగించారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేస్తున్నామని, అయితే ఈ హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.

ఢిల్లీలో కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ కలకలం
ఇదిలావుండగా గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ఏరియాలో ఉన్న ఒక జిమ్ వెలుపల కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు జిమ్‌పై సుమారు ఏడు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ఢిల్లీ దాడికి తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.


