ఉపగ్రహాలను ధ్వంసంచేసే అధునాతన ఆయుధతయారీలో రష్యా బిజీ
పశ్చిమదేశాల నిఘా వర్గాల సమాచారం
మిల్లీమీటర్ పొడవుండే వందలాది పెల్లెట్లతో దాడి!
పారిస్: ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహ కూటమిలోంచి కృత్రిమ ఉప గ్రహం ‘35956’ అదుపుతప్పి భూమి దిశగా కదులుతూ కొత్త ముప్పుమోసుకొస్తుంటే అంతకుమించి పెను ముప్పు రష్యా రూపంలో పొంచి ఉందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు ఆందోళనవ్యక్తంచేశాయి. అంతరిక్షంలో కక్షలో తిరిగే వందలాది కృత్రిమ ఉపగ్రహాలను పిట్టల్లా రాల్చేసే అధునాతన ఆయుధాన్ని తయారు చేయడంలో రష్యా తలమునకలైందని పశ్చిమదేశాల నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు నిఘా సమాచారంతో ది అసోసియేటెట్ ప్రెస్ వార్తాసంస్థ ఒక కథనాన్ని వెలువర్చింది.
దాని పేరు జీరో ఎఫెక్ట్
అంతరిక్షంలోని ఉపగ్రహాలపైకి అత్యంత సాంద్రతతో తయారుచేసిన సూక్ష్మ పెల్లెట్లను ప్రయోగించి వాటికి తీవ్ర నష్టం కలిగేలా చేయడమే రష్యా ఆయుధం అసలు లక్ష్యం. ఈ ఆయుధానికి ‘జీరో ఎఫెక్ట్’ అని పేరుపెట్టినట్లు తెలుస్తోంది. వందలాది పెల్లెట్లను ఒకేసారి ప్రయోగించడంతో వాటి ధాటికి ఒకేసారి పెద్ద సంఖ్యలో శాటిౖలైట్లును సర్వనాశనం అవుతాయి.
ఇవి చిన్నచిన్న ముక్కలుగా శకలాలుగా చెల్లాచెదురుగా పడడంతో సమీప కక్ష్యల్లోని ఇతర ఉపగ్రహాలకు సైతం దెబ్బతింటాయి. దీంతో వినాశనం ఊహించనంత పెద్దదిగా ఉంటుంది. ఇంతటి పెనువినాశనం సృష్టించగల ఆయుధాన్ని రష్యా సృష్టించకుండా ఉంటుందని తాము భావించట్లేమని అమెరికాలోని ప్రభుత్వేతర ‘ సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్’లోని అంతరిక్ష భద్రతా నిపుణుడు విక్టోరియా సామ్సన్, కెనడా సైన్యంలోని అంతరిక్ష విభాగ బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ వ్యాఖ్యానించారు. జీరో ఎఫెక్ట్ ఆయుధ తయారీ మీడియా ప్రశ్నించగా రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ డొంకతిరుగుడు సమాధానం చెప్పారు.
‘‘ కక్షలో తిరగగలిగే సామర్థ్యమున్న ఆయుధాల ప్రయోగాలను శత్రుదేశాలు ఆపేలా ఐరాస చొరవచూపాలి. అయినా అణ్వస్త్ర సామర్థ్యమున్న అంతరిక్ష ఆయుధాలను మొహరించబోమని పుతిన్ గతంలోనే చెప్పారు’’ అని పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తక్కువ ఎత్తులో తిరిగే స్టార్‌లింక్ ఉపగ్రహాలు రష్యా గగనతలంపై నిఘా పెట్టి ఉక్రెయిన్ దిశలో రష్యా సేనల జాడను గుర్తించి ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. దీంతో స్టార్‌లింక్ ఉపగ్రహాలు తమ సార్వభౌమత్వం, భద్రతకు ముప్పుగా వాటిల్లాయని వీటిని నాశనంచేయాలని రష్యా భావిస్తోందని పశ్చిమాసియా నిఘా వర్గాలు నిర్ధారించాయి.
పొడవు మిల్లీమీటర్!
‘‘హఠాత్తుగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ల వంటి వాటినే గుర్తించగలం. కేవలం మిల్లీమీటర్ పొడవుండే సూక్ష్మ పెల్లెట్లను భూతల, గగనతల నిఘా వ్యవస్థలు గుర్తించలేవు. వీటితో ఉపగ్రహాలపై దాడి చేస్తే నష్టనివారణ అసాధ్యం. పెల్లెట్ల దెబ్బకు ఒక కక్షలోని ఉపగ్రహాలన్నీ నాశనంఅవుతాయి. అదీకాకుండా దాడి చేసింది రష్యానే అని నిరూపించడం కూడా చాలా కష్టం.
మిల్లీమీటర్ పొడవు పెల్లెట్లతో ఉపగ్రహాలకు మరణశాసనం రాయొచ్చు. చైనా ఉదంతమే ఇందుకు చక్కటి ఉదాహరణ. నవంబర్‌లో సూక్ష్మస్థాయి అంతరిక్ష శకలం తగిలి చైనా వ్యోమనౌక దెబ్బతింది. దాంతో చైనా సొంత అంతరిక్ష కేంద్రం నుంచి అది బయల్దేరలేక అక్కడే ఉండిపోయింది. దాంతో దాని ద్వారా భూమి మీదకు రావాల్సిన చైనా వ్యోమగాములు సైతం అక్కడే చిక్కుకుపోయారు’’ అని బ్రిగేడియర్ జనరల్ క్రిస్టోఫర్ హోర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘ ఉపగ్రహాల ఉపరితలాల్లో అధిక ప్రాంతాన్ని ఆక్రమించేవి సౌర ఫలకాలే. పెల్లెట్ల ఉరవడికి ఇవన్నీ బద్దలవుతాయి. అప్పుడు ఉపగ్రహం మనుగడ ప్రశ్నార్థకమవుతుంది’’ అని వాషింగ్టన్‌లోని ‘సెంటర్ ఫర్ స్ట్రాటజీ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో అంతరిక్ష భద్రత, ఆయుధాల నిపుణుడు క్లేటన్ స్వాప్ చెప్పారు. స్టార్‌లింక్ ఉపగ్రహాలు భూమి నుంచి ఆకాశంలో 500 కిలోమీటర్ల ఎత్తులో సంచరిస్తున్నాయి. వీటి కింది కక్షల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చైనా వారి తియాంగ్ స్పేస్ స్టేషన్ తిరుగుతున్నాయి. రష్యా దాడి చేస్తే ఉపగ్రహాలు శకలాలుగా ఛిద్రమై అవి ఐఎస్‌ఎస్, తియాంగ్ స్పేస్‌స్టేషన్లనూ నాశనంచేసే ఆస్కారముంది.


