మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొత్త మలుపు తిరగనున్నట్లు నాటో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌కు మద్దతు అందిస్తున్న ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్లను నిర్వీర్యం చేసేందుకు రష్యా మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే పెల్లెట్లను తయారు చేస్తోందని, రానున్న రోజుల్లో ఈ శాటిలైట్లను కూల్చే ప్రయత్నం చేయనున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి.
నాటోకు చెందిన రెండు దేశాల గూఢచారి సంస్థలు రష్యా కొత్త యాంటీ శాటిలైట్ ఆయుధాన్ని అభివృద్ధి చేస్తోందని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ ఆయుధం ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
‘జోన్ ఎఫెక్ట్’గా పేర్కొంటున్న ఈ విధానం కక్ష్యలో మిల్లీమీటర్ పరిమాణంలో ఉన్న లోహపు కణాలను భారీగా విడుదల చేసి, ఉపగ్రహాలను ఢీకొట్టేలా చేస్తుంది. దీంతో ఒకేసారి అనేక ఉపగ్రహాలు నిర్వీర్యం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో రష్యా, చైనా వంటి దేశాల ఉపగ్రహాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
ప్రస్తుతం లో-ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఉపగ్రహాలలో స్టార్‌లింక్ వాటా చాలా గణనీయమైనది. ఉక్రెయిన్ యుద్ధంలో కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలు, సైనిక ఆపరేషన్లకు ఇవి కీలకంగా ఉపయోగపడుతున్నాయి. స్టార్‌లింక్‌ను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం జరిగితే అంతరిక్షంలో గందరగోళం పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ వ్యవస్థలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణుల అంచనా. ఈ కారణంగా రష్యా దీన్ని ప్రయోగించే అవకాశాలు తక్కువగా ఉండొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా అభివృద్ధి చేస్తోందని అనుమానిస్తున్న ఈ యాంటీ శాటిలైట్ విధానం అంతరిక్ష భద్రతకు పెద్ద సవాలుగా మారవచ్చని, స్టార్‌లింక్‌పై దృష్టి పెట్టడం ద్వారా పాశ్చాత్య దేశాల ప్రభావాన్ని తగ్గించాలన్న ఉద్దేశం ఉన్నట్టుగా నాటో ఇంటెలిజెన్స్ సూచిస్తోంది.


