రెండో దశ ప్రధాన కాలువ 400 కి.మీ నుంచి 463 కి.మీ వరకు లైనింగ్ పనులకు టెండర్
జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి కాంట్రాక్టు విలువ రూ.596.69 కోట్లు
గతేడాది లైనింగ్ చేసిన కాంట్రాక్టు సంస్థలకే పనులు దక్కేలా నిబంధన
ఫలితంగా నాకింత–నీకింత అంటూ కమీషన్లకు రంగం సిద్ధం
2024–25లోనూ రూ.3,850 కోట్లతో చేపట్టిన లైనింగ్ పనుల్లో భారీ దోపిడీ
సాక్షి, అమరావతి : హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ పేరుతో మరో విడత దోపిడీకి చంద్రబాబు సర్కార్ తెరతీసింది. శ్రీసత్య సాయి జిల్లా ముదిగుబ్బ, కదిరి, తలుపుల, ఎన్‌పీ కుంట మండలాల పరిధిలో హంద్రీ– నీవా రెండో దశ ప్రధాన కాలువ కాలువ 400.5 కి.మీ నుంచి 458.975/463 కి.మీ వరకు లైనింగ్ పనులు, మిగిలిపోయిన నిర్మాణ పనులకు రూ.487.48 కోట్ల అంచనాతో మంగళవారం టెండర్లు పిలిచింది. మరో రూ.109.21 కోట్లను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది.
అంటే.. కాంట్రాక్టు విలువ రూ.596.69 కోట్లు. ఈ పనులను లంప్సమ్ విధానంలో 18 నెలల్లోగా పూర్తి చేయాలని షరతు విధించింది. టెండర్‌లో బిడ్‌ల దాఖలుకు అక్టోబర్ 16 తుది గడువు. అక్టోబర్ 21న ఆర్థిక బిడ్‌ను తెరిచి టెండర్‌ను ఖరారు చేసి, పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించనుంది. 2016–17 నుంచి 2025–26 వరకూ ఏదైనా ఒక ఏడాదిలో 13,19,026 క్యూబిక్ మీటర్ల మట్టి పని.. 25,705 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని, 3,97,015 చదరపు మీటర్ల సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, షార్ట్ క్రీటింగ్, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్) పనులు పూర్తి చేసిన కాంట్రాక్టు సంస్థలకు టెండర్‌లో బిడ్ దాఖలుకు అర్హత ఉంటుందని పేర్కొంది.
గత పదేళ్లలో ఏదైనా ఓ ఏడాది 2026–27 ధరల ప్రకారం రూ.162.50 కోట్ల విలువైన ఇదే రకం పనులు పూర్తి చేసి ఉండాలని మరో షరతు విధించింది. వీటిని బట్టి చూస్తే హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216 కి.మీ నుంచి 400 కి.మీ వరకు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థల్లో ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ (ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘు), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు (ఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్), సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్ ఇన్‌ఫ్రా), సీఎం చంద్రబాబు సన్నిహితుడు రంగరాజు ఎండీగా ఉన్న ఎన్‌సీసీ, సీఎం రమేష్ (రిత్విక్ ప్రాజెక్ట్స్)లలో.. ఒక సంస్థకు పనులు కట్టబెట్టేందుకే షార్ట్ క్రీటింగ్‌కు తోడుగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని చేర్చారన్నది స్పష్టమవుతోంది.
సన్నిహితులకు కట్టబెట్టేందుకే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లింకు
» రాతి పొర ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాలువకు షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ (రాతి పొరకు ఇనుప జాలరీని అమర్చి.. దానిపై సిమెంటు కాంక్రీట్ వేయడం) చేయాలి. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేయడానికి సాధ్యం కాని చోట్ల మాత్రమే.. రాతి పొరకు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (ఇనుప మేకులతో కూడిన సిమెంట్ కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో స్ప్రే చేయడం) పద్ధతిలో లైనింగ్ చేయాలి.
» కానీ.. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216 నుంచి 400 కి.మీ వరకు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు 2024–2025లో పిలిచిన టెండర్లలో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ నిబంధన లేదు. సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ లేదా షార్ట్ క్రీటింగ్ విధానంలో మాత్రమే లైనింగ్ చేయాలని స్పష్టంగా ఉంది.
» టెండర్ నిబంధనలు ఉల్లంఘించి రాతి పొర లేకపోయినా కాలువ గట్లను సరి చేయకుండానే మట్టి పొరకే ఇష్టారాజ్యంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ చేసి బిల్లులు కాజేశారు. దాంతో 2025లో కాలువలో నీటి ప్రవాహ ఉద్ధృతికే లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోయి కొట్టుకుపోయింది. రూ.3,850 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆ పనుల్లో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని ఇంజినీరింగ్ నిపుణులు ఎత్తి చూపుతున్నారు.
» తాజాగా టెండర్లు పిలిచిన పనులనూ అస్మదీయ సంస్థకు కట్టబెట్టి.. భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచిపెట్టి.. నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు ముఖ్య నేత సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. అందుకే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పద్ధతిలో లైనింగ్ చేసినా టెండర్‌లో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉంటుందని నిబంధన పెట్టారని స్పష్టం చేస్తున్నారు.


