breaking news
Handri-Neeva scheme
-
హంద్రీ–నీవా లైనింగ్ పనుల్లో మరో దోపిడీకి ఎత్తు
సాక్షి, అమరావతి : హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ పేరుతో మరో విడత దోపిడీకి చంద్రబాబు సర్కార్ తెరతీసింది. శ్రీసత్య సాయి జిల్లా ముదిగుబ్బ, కదిరి, తలుపుల, ఎన్పీ కుంట మండలాల పరిధిలో హంద్రీ– నీవా రెండో దశ ప్రధాన కాలువ కాలువ 400.5 కి.మీ నుంచి 458.975/463 కి.మీ వరకు లైనింగ్ పనులు, మిగిలిపోయిన నిర్మాణ పనులకు రూ.487.48 కోట్ల అంచనాతో మంగళవారం టెండర్లు పిలిచింది. మరో రూ.109.21 కోట్లను జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది.అంటే.. కాంట్రాక్టు విలువ రూ.596.69 కోట్లు. ఈ పనులను లంప్సమ్ విధానంలో 18 నెలల్లోగా పూర్తి చేయాలని షరతు విధించింది. టెండర్లో బిడ్ల దాఖలుకు అక్టోబర్ 16 తుది గడువు. అక్టోబర్ 21న ఆర్థిక బిడ్‌ను తెరిచి టెండర్‌ను ఖరారు చేసి, పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించనుంది. 2016–17 నుంచి 2025–26 వరకూ ఏదైనా ఒక ఏడాదిలో 13,19,026 క్యూబిక్ మీటర్ల మట్టి పని.. 25,705 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని, 3,97,015 చదరపు మీటర్ల సిమెంట్ కాంక్రీట్ లైనింగ్, షార్ట్ క్రీటింగ్, ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (స్టీల్ ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్) పనులు పూర్తి చేసిన కాంట్రాక్టు సంస్థలకు టెండర్లో బిడ్ దాఖలుకు అర్హత ఉంటుందని పేర్కొంది. గత పదేళ్లలో ఏదైనా ఓ ఏడాది 2026–27 ధరల ప్రకారం రూ.162.50 కోట్ల విలువైన ఇదే రకం పనులు పూర్తి చేసి ఉండాలని మరో షరతు విధించింది. వీటిని బట్టి చూస్తే హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216 కి.మీ నుంచి 400 కి.మీ వరకు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థల్లో ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ (ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘు), కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు (ఎస్సార్ కన్స్ట్రక్షన్స్), సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్ ఇన్ఫ్రా), సీఎం చంద్రబాబు సన్నిహితుడు రంగరాజు ఎండీగా ఉన్న ఎన్సీసీ, సీఎం రమేష్ (రిత్విక్ ప్రాజెక్ట్స్)లలో.. ఒక సంస్థకు పనులు కట్టబెట్టేందుకే షార్ట్ క్రీటింగ్కు తోడుగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని చేర్చారన్నది స్పష్టమవుతోంది. సన్నిహితులకు కట్టబెట్టేందుకే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లింకు » రాతి పొర ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కాలువకు షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ (రాతి పొరకు ఇనుప జాలరీని అమర్చి.. దానిపై సిమెంటు కాంక్రీట్ వేయడం) చేయాలి. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేయడానికి సాధ్యం కాని చోట్ల మాత్రమే.. రాతి పొరకు ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ (ఇనుప మేకులతో కూడిన సిమెంట్ కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో స్ప్రే చేయడం) పద్ధతిలో లైనింగ్ చేయాలి. » కానీ.. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216 నుంచి 400 కి.మీ వరకు, పుంగనూరు బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులకు 2024–2025లో పిలిచిన టెండర్లలో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ నిబంధన లేదు. సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ లేదా షార్ట్ క్రీటింగ్ విధానంలో మాత్రమే లైనింగ్ చేయాలని స్పష్టంగా ఉంది. » టెండర్ నిబంధనలు ఉల్లంఘించి రాతి పొర లేకపోయినా కాలువ గట్లను సరి చేయకుండానే మట్టి పొరకే ఇష్టారాజ్యంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో అత్యంత నాసిరకంగా లైనింగ్ చేసి బిల్లులు కాజేశారు. దాంతో 2025లో కాలువలో నీటి ప్రవాహ ఉద్ధృతికే లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోయి కొట్టుకుపోయింది. రూ.3,850 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆ పనుల్లో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని ఇంజినీరింగ్ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. » తాజాగా టెండర్లు పిలిచిన పనులనూ అస్మదీయ సంస్థకు కట్టబెట్టి.. భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచిపెట్టి.. నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు ముఖ్య నేత సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. అందుకే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ పద్ధతిలో లైనింగ్ చేసినా టెండర్లో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉంటుందని నిబంధన పెట్టారని స్పష్టం చేస్తున్నారు. -
‘హంద్రీ–నీవా’ విస్తరణకే సర్కారు మొగ్గు
-
‘హంద్రీ–నీవా’ విస్తరణకే సర్కారు మొగ్గు
- కోటరీ కాంట్రాక్టర్ల ఒత్తిడితో నిపుణుల కమిటీ నివేదిక బుట్టదాఖలు చేసిన సీఎం - రూ.1,257 కోట్ల అంచనాతో ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవాలని ఒత్తిడి సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ విస్తరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. కాలువకు లైనింగ్ చేస్తే సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చంటూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసింది. రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్సీ, తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడి ఒత్తిడి మేరకు ప్రధాన కాలువ విస్తరణ పనులకే ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపారు. రూ.1,257 కోట్లతో విస్తరణ పనులకు పరిపాలన అనుమతి ఇచ్చేసి.. ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవాలంటూ జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద వచ్చే సమయంలో రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజులపాటు 40 టీఎంసీలు తరలించి, రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ప్రధాన కాలువలో 2,024 క్యూసెక్కులకు మించి తరలించలేని పరిస్థితి నెలకొంది. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన కాలువకు లైనింగ్ చేస్తే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చని, ఇందుకు రూ.600 కోట్ల వ్యయం అవుతుందని నెలన్నర క్రితం నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. నిర్మాణాలతో నిమిత్తం లేకుండా ప్రధాన కాలువ విస్తరణ పనులకు ఒకే ప్యాకేజీ కింద టెండర్ పిలవాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేవలం మట్టి పనులే కావడంతో.. కాంట్రాక్టర్ భారీ ఎత్తున లాభపడే అవకాశం ఉంది.


