‘హంద్రీ–నీవా’ విస్తరణకే సర్కారు మొగ్గు
హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ విస్తరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది.
- కోటరీ కాంట్రాక్టర్ల ఒత్తిడితో నిపుణుల కమిటీ నివేదిక బుట్టదాఖలు చేసిన సీఎం
- రూ.1,257 కోట్ల అంచనాతో ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవాలని ఒత్తిడి
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ విస్తరణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. కాలువకు లైనింగ్ చేస్తే సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చంటూ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసింది. రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్సీ, తన కోటరీలోని రాజ్యసభ సభ్యుడి ఒత్తిడి మేరకు ప్రధాన కాలువ విస్తరణ పనులకే ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపారు. రూ.1,257 కోట్లతో విస్తరణ పనులకు పరిపాలన అనుమతి ఇచ్చేసి.. ఒకే ప్యాకేజీ కింద టెండర్లు పిలవాలంటూ జలవనరుల శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద వచ్చే సమయంలో రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 120 రోజులపాటు 40 టీఎంసీలు తరలించి, రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ప్రధాన కాలువలో 2,024 క్యూసెక్కులకు మించి తరలించలేని పరిస్థితి నెలకొంది. పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన కాలువకు లైనింగ్ చేస్తే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చని, ఇందుకు రూ.600 కోట్ల వ్యయం అవుతుందని నెలన్నర క్రితం నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.
నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. నిర్మాణాలతో నిమిత్తం లేకుండా ప్రధాన కాలువ విస్తరణ పనులకు ఒకే ప్యాకేజీ కింద టెండర్ పిలవాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేవలం మట్టి పనులే కావడంతో.. కాంట్రాక్టర్ భారీ ఎత్తున లాభపడే అవకాశం ఉంది.


