కర్నూలు జిల్లాలో రైతు.. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఇద్దరు కౌలురైతుల బలవన్మరణం
గూడూరు/ప్రత్తిపాడు/ పెదకూరపాడు: ప్రకృతి సహకరించకపోవడం... ప్రభుత్వం సాయం చేయకపోవడం వల్ల వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ముగ్గురు కర్షకులు ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన రైతు గొల్లబంక శ్రీనివాసులు(45) సొంత పొలం ఎకరాతోపాటు రెండెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఉల్లి, పత్తి పంటల్లో వరుసగా తీవ్ర నష్టాలు రావడంతో రూ.20 లక్షల వరకు అప్పులపాలయ్యాడు.
ఉన్న ఎకరా పొలాన్ని అమ్మేసి రూ.12 లక్షలు అప్పు తీర్చినా, మరో రూ.8 లక్షల బాకీ మిగలడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు ఆదివారం పొలం వద్ద పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి కర్నూలు శివారులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
చెట్టుకు ఉరి వేసుకుని...
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలేనికి చెందిన చిమటా భాస్కర్ (40)కు సెంటు సాగు భూమి కూడా లేదు. ఏటా పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటాడు. ఈ ఏడాది ఐదెకరాలు కౌలుకు తీసుకుని మూడున్నర ఎకరాల్లో పొగాకు, ఎకరన్నరలో మిర్చి సాగు చేశాడు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో పెట్టుబడి మొత్తం నష్టపోయాడు. వరుసగా వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.15 లక్షల మేర అప్పులపాలయ్యాడు.
అప్పు తీర్చే మార్గం లేదనే బాధతో భాస్కర్ సోమవారం రాత్రి గ్రామ శివారులోని పొలాల్లో చెట్టుకు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భాస్కర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని తండ్రి, దివ్యాంగుడైన సోదరుడు కూడా భాస్కర్‌పైనే ఆధారపడి ఉన్నారు. కాగా, పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం తమ్మవరం గ్రామానికి చెందిన కౌలు రైతు కత్తుల బాలకోటయ్య అలియాస్ కోటేశ్వరరావు(40) అప్పుల బాధ భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఐదు ఎకరాల మెట్ట భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న ఆయన వరుసగా నష్టాలు రావడంతో ఈ నెల 27వ తేదీ రాత్రి ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అమరావతిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గోరంట్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. కోటేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


