శ్రీలంకతో గాలె టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత బౌలర్ల విజృంభణతో లంక బ్యాటర్లు ఆరంభంలోనే పెవిలియన్‌కు వరుస కట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడం బ్యాటర్ల వైఫల్యానికి నిదర్శనం.
తొలి ఇన్నింగ్స్ ఇలా
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలె స్టేడియంలో శనివారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది.
టాపార్డర్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం (82) సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 230 బంతులు ఎదుర్కొని 167 పరుగులు సాధించాడు. వీరితో పాటు ఆరో నంబర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ (51)తో రాణించాడు.
లంకను కట్టడి చేసిన భారత బౌలర్లు
లంక బౌలర్లలో స్పిన్నర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లతో విజృంభించగా.. కేశారా నువాంత మూడు వికెట్లు పడగొట్టాడు. పేసర్ అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగి 284 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత స్పిన్నర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్ కూల్చారు. దీనిని బట్టి ఓవరాల్‌గా ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ల హవా కొనసాగిందని చెప్పవచ్చు.
అయితే, రెండో ఇన్నింగ్స్‌కు వచ్చే సరికి కథ మారిపోయింది. ఈసారి పిచ్ కాస్త పేస్ బౌలర్లకు అనుకూలించగా.. లంక పేసర్లు అసిత ఫెర్నాండో, లాహిరు కుమార టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశారు. అసిత నాలుగు వికెట్లు తీయగా.. కుమార రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ప్రభాత్ జయసూర్యకు మూడు వికెట్లు దక్కగా.. కేశారా ఒక వికెట్ తీశాడు.
ఈసారి 193 పరుగులకే ఆలౌట్
లంక బౌలర్ల విజృంభణ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే కుప్పకూలింది. అయితే, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 పరుగులు కలుపుకొని.. శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పేసర్ సిరాజ్ నిశాన్ మధుష్క (6)ను అవుట్ చేయగా భారత్ వికెట్ల ఖాతా తెరిచింది. స్పిన్నర్ మానవ్ సుతార్ పసిందు సూరియబండారా (0), లాహిరు ఉదార (16)లను పెవిలియన్‌కు పంపగా.. మరో పేసర్ ప్రసిద్ కృష్ణ కమిందు మెండిస్ (2)ను అవుట్ చేశాడు.
పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ
ఇలా లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ కెప్టెన్ ధనంజయ డి సిల్వతో కలిసి సొనాల్ దినుష ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ధనంజయ 31, దినుష 25 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా లంక ఆట పూర్తయ్యేసరికి 34 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేయగలిగింది.
ఇక బుధవారం ఆటకు చివరి రోజు కాగా.. లంక విజయానికి 288 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా బుధవారం వీలైనంత త్వరగా భారత బౌలర్లు ధనంజయ, దినుష జోడీని విడదీయాల్సి ఉంటుంది. దినుష తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (100) చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: టీమిండియాకు చేదువార్త!


