టీమిండియాకు బ్యాడ్‌న్యూస్‌! | IND vs SL 1st Test Day 4: Dhruv Jurel Injured Leaves Field | Sakshi
Sakshi News home page

టీమిండియాకు బ్యాడ్‌న్యూస్‌!

Aug 18 2026 6:01 PM | Updated on Aug 18 2026 6:40 PM

IND vs SL 1st Test Day 4: Dhruv Jurel Injured Leaves Field

PC: Sony Sports X

శ్రీలంకతో తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో స్టార్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌  ఫీల్డింగ్‌కు వచ్చాడు.

కాగా గాలె వేదికగా మొదటి టెస్టులో టీమిండియా శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు.. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్‌ నిశాన్‌ మధుష్క (6)ను అవుట్‌ చేసి సిరాజ్‌ వికెట్ల వేటను ఆరంభించాడు.

అనంతరం స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ వన్‌డౌన్‌లో వచ్చిన పసిందు సూరియబండారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత ప్రసిద్‌ కృష్ణ కమిందు మెండిస్‌ (2)ను అవుట్‌ చేయగా.. సుతార్‌ బౌలింగ్‌లో లాహిరు ఉదార (16) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో కెప్టెన్‌ ధనంజయ డి సిల్వకు తోడైన సొనాల్‌ దినుష నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. అయితే, లంక రెండో ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్లో మానవ్‌ సుతార్‌ బంతితో రంగంలోకి దిగి.. ఫ్లైటెడ్‌ డెలివరీని సంధించాడు. 

దీంతో స్వీప్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో దినుష బంతిని బలంగా బాదగా.. ఫీల్డర్‌ జురెల్‌ కాళ్లకు తాకింది. అతడు నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. నొప్పి తగ్గకపోవడంతో ఫిజియో సాయంతో జురెల్‌ మైదానాన్ని వీడగా.. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా సర్ఫరాజ్‌ ఖాన్‌ మైదానంలోకి వచ్చాడు. 

కాగా గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జురెల్‌ హాఫ్‌ సెంచరీ (51) చేశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.

ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ధనంజయ 31, దినుష 25 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక గెలవాలంటే ఆటకు చివరి రోజైన బుధవారం లంకకు 288 పరుగులు అవసరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement