‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’ | Tell Him He Wont Play: Gambhir Sent Message How To Manage Vaibhav | Sakshi
Sakshi News home page

‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’

Jul 4 2026 12:19 PM | Updated on Jul 4 2026 1:07 PM

Tell Him He Wont Play: Gambhir Sent Message How To Manage Vaibhav

వైభవ్‌ సూర్యవంశీ (PC: Instagram)

భారత క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా వైభవ్‌ సూర్యవంశీ గురించే చర్చ. ఈ చిచ్చరపిడుగును వీలైనంత త్వరగా టీమిండియాకు ఆడించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తూ వస్తోంది.

వాళ్లు విఫలమవుతున్నా..
ఐర్లాండ్‌ పర్యటనలోనే వైభవ్‌ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ రెండు మ్యాచ్‌లలోనూ ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌కు మొండిచేయే ఎదురైంది. ఇక ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా తొలి టీ20లోనూ పదిహేనేళ్ల ఈ పిల్లాడిని పక్కనపెట్టేశారు. మరోవైపు.. టాపార్డర్‌లో ఓపెనర్‌ సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ వరుసగా విఫలమవుతున్నారు.

ఇలాంటి తరుణంలో వైభవ్‌ సూర్యవంశీని ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని కావాలనే పక్కనపెడుతున్నారనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పార్థివ్‌ పటేల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలి
స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్‌కు కచ్చితంగా ఆడే అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే, ప్రస్తుతానికి కోచింగ్‌ సిబ్బంది అతడికి సరైన రీతిలో కమ్యూనికేట్‌ చేయాలి. నిరాశ చెందిన బ్యాటర్‌కు.. ‘నువ్వు రేసులోనే ఉన్నావు’ అనే విషయాన్ని తెలియజేయాలి.

ఇలా చేయడం ద్వారా అతడిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఒకవేళ అతడిని ఆడించడం కుదురలేదంటే.. ఆ నిజాన్ని కూడా నేరుగా అతడితోనే చెప్పాలి. వైభవ్‌ పదిహేనేళ్ల పిల్లాడు. అతడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

తను నిరాశ చెందకుండా చూసుకోవాలి. తుదిజట్టులో స్థానం కోసం ఓపికతో ఎదురుచూడాల్సి ఉంటుందని సానుకూలంగా తెలియజెప్పాలి. అప్పుడే అతడి మనసు కాస్త స్థిమితంగా ఉంటుంది’’ అని పార్థివ్‌ పటేల్‌ పేర్కొన్నాడు.

ఇప్పుడు వైభవ్‌ను ఆడించడం కుదరదు
అదే విధంగా.. ‘‘సంజూ శాంసన్‌ ప్రపంచకప్‌ టోర్నీలో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఇషాన్‌ కిషన్‌ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్నాడు. అభిషేక్‌ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి తరుణంలో కచ్చితంగా వైభవ్‌కు టాపార్డర్‌లో చోటు ఉండదు. 

ఇదే విషయాన్ని అతడికి అర్థమయ్యేలా చెప్పాలి’’ అని హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ నేతృత్వంలోని కోచింగ్‌ సిబ్బందికి పార్థివ్‌ పటేల్‌ విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఇరుజట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు మాంచెస్టర్‌ వేదిక.

చదవండి: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్‌ పోస్ట్‌ వైరల్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement