PC: BCCI Twitter
భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల జూలై 23 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ప్రారంభం కానుంది. వరుసగా మూడు సిరీస్‌లను కోల్పోయి జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా అక్కడ ఎలా రాణిస్తుందోనని అందరూ ఆతృతగా ఎదరు చూస్తున్నారు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైన వైభవ్‌కు ఈ జింబాబ్వే టూర్ అద్భుత అవకాశంగా చెప్పుకోవాలి.
సంజూ శాంసన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఆరంభించనున్నాడు. ఈ సిరీస్‌లో వైభవ్ తనను తను నిరూపించుకుంటే భారత టీ20 జట్టులో అతడి స్దానం పదిలంగా ఉంటుంది. అయితే జింబాబ్వే గడ్డపై సూర్యవంశీ అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది.
వైభవ్ చెలరేగడం ఖాయం!
ఈ ఏడాది ఆరంభంలో జింబాబ్వే వేదికగా అండర్-19 ప్రపంచకప్‌లో వైభవ్ దుమ్ములేపాడు. ముఖ్యంగా ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై అతడు విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇది యూత్ వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచిపోయింది.
ఈ చిచ్చర పిడుగు జింబాబ్వేలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి 169.49 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 439 పరుగులు సాధించాడు. ఇప్పుడు భారత సీనియర్ జట్టు తరపున కూడా అదే జోరును కనబరుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాగా జింబాబ్వే పర్యటనలో భారత జట్టు ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. వరుస సిరీస్‌లతో బీజీగా ఉండడంతో రెగ్యులర్ హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.
చదవండి: వైభవ్ 'తరానికి ఒక్కడు'.. కాపాడుకోండి: సికందర్ రజా


