కామన్వెల్త్‌ పతకమే లక్ష్యంగా... | Lovlina in Commonwealth Games practice | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ పతకమే లక్ష్యంగా...

Jul 1 2026 4:13 AM | Updated on Jul 1 2026 4:13 AM

Lovlina in Commonwealth Games practice

భారత స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా సన్నాహాలు

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించడమే ఈ ఏడాది తన లక్ష్యమని భారత స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌ (75 కేజీలు) వెల్లడించింది. ఒలింపిక్స్‌ సహా దాదాపు అన్నీ అంతర్జాతీయ ప్రముఖ టోర్నమెంట్‌లలో పతకాలు నెగ్గిన లవ్లీనా... ఇప్పటి వరకు కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకం గెలవలేదు. దీంతో ప్రస్తుతం ఆ లోటును భర్తీ చేసుకోవాలని 28 ఏళ్ల లవ్లీనా భావిస్తోంది. ఈ నెల 23 నుంచి ఆగస్టు 2 వరకు గ్లాస్గో వేదికగా కామన్వెల్త్‌ క్రీడలు జరగనుండగా... లవ్లీనా ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. 

ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ... ‘కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించలేకపోయాననే బాధ ఉంది. ఈసారి ఎలాగైనా దాన్ని అధిగమిస్తా. అందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నా. ఈ ఏడాది నేను నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఇది చాలా ముఖ్యమైంది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయని నమ్ముతా. అందుకే ప్రస్తుతం నా దృష్టి అంతా ప్రాక్టీస్‌పైనే ఉంది. రింగ్‌లో మెరుగైన ఆటతీరు కనబరిస్తే కామన్వెల్త్‌ పతకం ఖాతాలో చేరడం ఖాయం’ అని పేర్కొంది.  

లోపాలు సవరించుకుంటున్నా... 
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన లవ్లీనా... వరల్డ్‌ చాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లు, స్ట్రాంజా స్మారక టోర్నమెంట్‌ ఇలా దాదాపు అన్నీ ప్రముఖ టోర్నమెంట్‌లలో పతకాలు సాధించింది. 2023లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన లవ్లీనా... 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఏడాది విరామం అనంతరం ప్రపంచ చాంపియన్‌షిఫ్‌లోనూ పతకం సాధించలేకపోయిన ఈ అస్సాం బాక్సర్‌... ఈ ఏడాది బోక్సమ్‌ ఎలైట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. 

‘నా ఆటలోని లోపాలను గుర్తించా. ప్రస్తుతం వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నా. రింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఒకే తీవ్రత కొనసాగించడంపై దృష్టిపెట్టా. కోచ్‌ శాంటియాగో నీవా నేతృత్వంలో సాధన చేస్తున్నా. ఆయన వ్యూహాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. రింగ్‌లో కదలికల విషయంలో ఆయన సూచనలు నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాయి. కాళ్ల కదిలికలను మెరుగు పరుచుకోవడంతో పాటు టైమింగ్, డిఫెన్స్, కాంబినేషన్‌ పంచ్‌లపై దృష్టి పెట్టా. అలాగే ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లో ఎలా ముందుకు సాగాలనే దానిపై కూడా సాధన సాగుతోంది’ అని లవ్లీనా వెల్లడించింది.  

అంచనాలకు తగ్గట్లు ఆడితేనే.. 
కెరీర్‌ ఆరంభంలో 69 కేజీల విభాగంలో పోటీ పడ్డ లవ్లీనా... ప్రస్తుతం 75 కేజీల ఈవెంట్‌లో బరిలోకి దిగుతోంది. ‘వెయిట్‌ కేటగిరీలో మార్పు చేసుకున్న కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ముఖ్యంగా ఎక్కువ వెయిట్‌ కేటగిరీలో మరింత పవర్‌ అవసరమయ్యేది. నిదానంగా దానికి అలవాటు పడ్డా. బరువు పెరిగినా పంచ్‌ స్పీడ్‌లో ఎలాంటి మార్పు రాకపోవడం నాకు కలిసొచ్చింది’ అని లవ్లీనా చెప్పింది. 

కామన్వెల్త్‌ క్రీడల్లో ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, కెనడా, స్కాట్లాండ్‌ వంటి దేశాల బాక్సర్లతో తీవ్ర పోటీ ఎదురవనున్న నేపథ్యంలో... అంచనాలకు తగ్గట్లు రాణించడంపైనే దృష్టి పెట్టినట్లు అస్సాం బాక్సర్‌ వెల్లడించింది. ‘అంతర్జాతీయ బాక్సర్‌గా ఒత్తిడిని ఎదుర్కోవడం నాకు కొత్త కాదు. అయితే రింగ్‌లో మాత్రం ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఏరోజుకా రోజు సాధనతో మెరుగవడం. ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటమే నా బలం దాన్నే ఇక ముందు కూడా కొనసాగిస్తా’ అని లవ్లీనా వివరించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement