పంత్ సిక్సర్ల రికార్డు | Rishabh Pant Scripts New Test Record, Overtakes Jacques Kallis And Climbs To Fourth On Six Hitting List | Sakshi
Sakshi News home page

పంత్ సిక్సర్ల రికార్డు

Aug 16 2026 4:34 PM | Updated on Aug 16 2026 5:53 PM

Rishabh Pant Powers Into Test History With Record Breaking 6 Hitting Spree

source: BCCI X

భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదడంతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో లెజండరీ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌ను (97 సిక్సర్లు) అధిగమించాడు.

ఈ జాబితాలో బెన్‌ స్టోక్స్‌ (138), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (107), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (100), టిమ్‌ సౌథీ (98), క్రిస్‌ గేల్‌ (98) పంత్‌ (98) కంటే ముందున్నారు.

2024లో విమర్శలు.. 2025లో అద్భుతమైన పునరాగమనం
టెస్ట్ క్రికెట్‌లో పంత్ దూకుడైన బ్యాటింగ్‌కు ఎప్పటినుంచో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే 2024లో అతని ఆ దూకుడే ప్రతికూలంగా మారింది. ఆ ఏడాది 17 ఇన్నింగ్స్‌ల్లో 576 పరుగులు చేసిన పంత్ సగటు 36.00గా ఉంది.

అయితే 2025లో పంత్ అద్భుతంగా పుంజుకున్నాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 629 పరుగులు, 48.38 సగటుతో రాణించాడు. 2026లోనూ అతను 81, 39 పరుగుల ఇన్నింగ్స్‌లతో ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పంత్ 51 టెస్టుల్లో 3,596 పరుగులు, 43.32 సగటు, 73.91 స్ట్రైక్‌రేట్‌తో కొనసాగుతున్నాడు.

అంతేకాదు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా గడ్డలపై టెస్ట్ సెంచరీలు సాధించిన అరుదైన వికెట్ కీపర్లలో పంత్ ఒకడిగా చలామణి అవుతున్నాడు.

జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉందా..?
పంత్ ఎంతటి మ్యాచ్ విన్నర్ అయినప్పటికీ, టెస్టుల్లో అతని దూకుడు బ్యాటింగ్‌పై అప్పుడప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీమిండియాలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా విఫలమైతే ఏ ఆటగాడికైనా జట్టులో స్థానం ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉంది.

పంత్ ఇప్పటికే భారత టెస్ట్ వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు. ఒకవేళ భవిష్యత్తులో అతను టెస్ట్ జట్టులో చోటు కోల్పోతే, అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ధృవ్ జురెల్ ప్రధాన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.

అయితే ప్రస్తుతానికి పంత్ తన బ్యాటింగ్‌తోనే సమాధానం ఇస్తున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 100 సిక్సర్ల మైలురాయికి అతను కేవలం రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వర్షం కారణంగా రెండో రోజు ఆటలో దాదాపు రెండు సెషన్ల ఆట జరగలేదు. మూడో సెషన్‌లో ఆట ప్రారంభమైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లు దేవదత్‌ పడిక్కల్‌ (167), రిషభ్‌ పంత్‌ (39)తో పాటు కేఎల్‌ రాహుల్‌ (82) ఔటయ్యారు. ధృవ్‌ జురెల్‌ (22), రవీంద్ర జడేజా (9) క్రీజ్‌లో ఉన్నారు. జట్టు స్కోర్‌ 372-5గా ఉంది. 

తొలి రోజు ఆటలో భారత్‌ యశస్వి జైస్వాల్‌ (32), కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య, కేశర నువంత తలో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement