రేపటి నుంచి కామన్వెల్త్ గేమ్స్
గ్లాస్గో (స్కాట్లాండ్): ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి తెరపడి మూడు రోజులు గడిచాయో లేదో క్రీడాభిమానులను అలరించేందుకు మరో మెగా క్రీడా ఈవెంట్ సిద్ధమైంది. బ్రిటిష్ పాలిత దేశాల మధ్య నాలుగేళ్లకోసారి జరిగే కామన్వెల్త్ గేమ్స్ బుధవారం ప్రారంభమవుతాయి. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరం వేదికగా ఆగస్టు 2వ తేదీ వరకు కామన్వెల్త్ గేమ్స్ జరుగుతాయి. ఈ క్రీడలకు మస్కట్‌గా యునికార్న్ (ఒంటికొమ్ము గుర్రం)ను ఎంపిక చేశారు. దీనికి ‘ఫినీ’ అని పేరు పెట్టారు. 74 దేశాల నుంచి 3000 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటారు.
భారత్, ఆ్రస్టేలియా, కెనడా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేతలు ఈ క్రీడల్లో బరిలోకి దిగనున్నారు. వాస్తవానికి 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యహక్కులు ఆ్రస్టేలియాలోని విక్టోరియా నగరానికి కేటాయించారు. అయితే 2023లో ఈ క్రీడలు నిర్వహించలేమంటూ ఆ్రస్టేలియా ప్రకటించింది. దాంతో ఈ క్రీడల నిర్వహణకు మరోసారి గ్లాస్గో ముందుకొచ్చింది. 2014 కామన్వెల్త్ గేమ్స్ కూడా గ్లాస్గోలోనే జరిగాయి.
ఓవరాల్‌గా స్కాట్లాండ్‌లో కామన్వెల్త్ క్రీడలు స్కాట్లాండ్‌లో జరగనుండటం ఇది నాలుగోసారి. అంతకుముందు 1970, 1986లో స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్ కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చింది. 2022 బర్మింగ్‌హామ్‌లో 20 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ఈసారి 10 క్రీడాంశాల్లోనే (3x3 బాస్కెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జూడో, నెట్‌బాల్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, లాన్ బౌల్స్) నిర్వహించనున్నారు. భారత్ నుంచి 125 మంది క్రీడాకారులు 10 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత్‌లోని అహ్మదాబాద్ నగరంలో జరగనున్నాయి.


