కోల్‌కతా: బెంగాల్ క్రికెటర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ పొరేల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఒక రేప్ కేసులో నిందితుడిగా 24 ఏళ్ల పొరేల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని మొబైల్ ఫోన్ తదితర ఎల్రక్టానిక్ వస్తువులను వెంటనే సీజ్ చేయాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని పొరేల్ బయటపెట్టే ప్రమాదం ఉండటంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
పొరేల్ ఎక్కడున్నా అతడిని అదుపులోకి తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. గత నెలలో రేప్ ఆరోపణలతో మోగ్రా పోలీస్ స్టేషన్‌లో పొరేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటాననే హామీతో పొరేల్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని... తమ ఇద్దరికి సంబంధించి వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి ఇప్పుడు బెదిరిస్తున్నాడని ఒక అమ్మాయి ఫిర్యాదు చేసింది. 2023 నుంచి తమ మధ్య సంబంధం ఉందని ఆమె పేర్కొంది.


