హర్జీందర్ కౌర్ ఖాతాలో సిల్వర్ మెడల్
బాక్సింగ్‌లో ఆరు పతకాలు ఖాయం
గ్లాస్గో: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల జాబితాలో మరో రెండు రజతాలు చేరాయి. మరో ఆరు పతకాలు ఖరారయ్యాయి. హర్జీందర్ కౌర్ ప్రదర్శనతో వెయిట్‌లిఫ్టింగ్‌లో మరో మెడల్ మనకు దక్కగా... అథ్లెటిక్స్‌లో గుల్వీర్ సింగ్ పరుగు పతకాన్ని అందించింది. ఆరుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు.
పురుషుల 10,000 మీటర్ల పరుగును 27 నిమిషాల 49.78 సెకన్లలో పూర్తి చేసి గుల్వీర్ రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ (27 నిమిషాల 48.93 సెకన్లు) స్వర్ణం గెలుపొందగా, డేవిడ్ ములార్కీ (ఐల్ ఆఫ్ మ్యాన్; 27 నిమిషాల 50.28 సె.) కాంస్యం దక్కించుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల 10 వేల మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. 1986 క్రీడల తర్వాత ఈ పోటీల్లో ఒక్క ఆఫ్రికా అథ్లెట్ కూడా టాప్–3లో నిలవకపోవడం ఇదే మొదటిసారి.
పూర్తిగా ప్రతికూల వాతావరణం, భారీ వర్షం, అనూహ్యంగా మారుతున్న ఉష్ణోగ్రతలు... ఇలాంటి స్థితిలో 10 వేల మీటర్ల పరుగు అథ్లెట్లకు కష్టంగా మారింది. గత ఏడాది తాను నెలకొల్పిన అత్యుత్తమ ప్రదర్శన (27 నిమిషాల 14.88 సెకన్లు)ను ఇలాంటి స్థితిలో గుల్వీర్ పునరావృతం చేయలేకపోయినా... రజతంతో సత్తా చాటాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలుచుకున్న డానిల్ ఎబెన్యో (కెన్యా), ఆస్కార్ షెలిమో (ఉగాండా)లను వెనక్కి నెట్టడంలో 28 ఏళ్ల గుల్వీర్ సఫలమయ్యాడు.
రేస్ ఆరంభంలో వేగంగా దూసుకుపోయి ఆ తర్వాత మధ్యలో కాస్త తగ్గి చివర్లో జోరందుకున్నాడు. 4,000 మీటర్ల వరకు మూడో స్థానంలో ఉన్న అతను... 6,800 మీటర్లు ముగిసేసరికి 9వ స్థానంలో నిలిచాడు. అయితే ఆ తర్వాత చెలరేగిపోయి పతకం దిశగా సాగిపోయాడు. చివరి 200 మీటర్ల ముందు మూడో స్థానంలో నిలిచిన గుల్వీర్ వేగం పెంచి చివరకు రెండో స్థానంతో ముగించాడు. మరోవైపు మహిళల హైజంప్‌లో ఆసియా చాంపియన్ పూజ సింగ్ 1.77 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.
పురుషుల షాట్‌పుట్‌లో తజిందర్ పాల్ సింగ్ తూర్, సమర్‌దీప్ సింగ్ గిల్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల 200 మీటర్ల విభాగంలో అనిమేశ్ కుజుర్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల స్విమ్మింగ్‌లో సాజన్ ప్రకాశ్, అనీశ్ గౌడ 200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. పారా స్విమ్మర్లు సుయశ్ నారాయణ్ జాధవ్, చైతన్య విశ్వాస్ పురుషుల ఎస్7 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో ఫైనల్లోకి అడుగు పెట్టారు.
మట్టి రోడ్లపై మొదలు పెట్టి...
ఆర్మీలో ఇంటర్ యూనిట్ రేస్‌లలో అథ్లెట్లు మంచి ప్రదర్శన కనబరిస్తే పలు ప్రయోజనాలు ఉన్నాయి. అత్యుత్తమ డైట్, కఠిన షిఫ్ట్‌ల నుంచి విముక్తి, ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. గుల్వీర్ సింగ్ కూడా సరిగ్గా దీనిపైనే దృష్టి పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని అత్రౌలి జిల్లా సిర్సాకు చెందిన గుల్వీర్ ముందుగా ఆర్మీలో ఎంపికయ్యేందుకు తన ఊర్లో మట్టి రోడ్డులపై పరుగెత్తాడు. అక్కడ జవాన్‌గా చేరిన తర్వాత దానినే కొనసాగిస్తూ ఇంటర్ యూనిట్ రేస్‌లలో పాల్గొంటూ వచ్చాడు. సైన్యంలో చేరిన మూడేళ్లలోపే 2023 జాతీయ క్రీడల్లో అతను 10,000 మీటర్ల పరుగులో చాంపియన్‌గా నిలిచి వెలుగులోకి వచ్చాడు.
3,000 మీటర్లు, 5,000 మీటర్ల పరుగులో కూడా జాతీయ రికార్డులు అతని పేరిటే ఉన్నాయి. హాఫ్ మారథాన్‌ను గంటలోపు పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్ గుల్వీర్. ఆసియా క్రీడల్లో కూడా కాంస్యం గెలుచుకున్నా ... ఆఫ్రికన్లు లేని ఆ ఈవెంట్‌లో అతని విజయానికి తగిన విలువ దక్కలేదు. తాజా ఈవెంట్ కోసం యూఎస్‌లోని కొలరాడో స్ప్రింగ్స్‌లో కోచ్ స్కాట్ సైమన్స్ పర్యవేక్షణలో తీసుకున్న ప్రత్యేక శిక్షణ తగిన ఫలితాన్నిచ్చింది. మిల్కా సింగ్, అవినాశ్ సాబ్లే తర్వాత కామన్వెల్త్ క్రీడల నాన్–రిలే ట్రాక్‌లో పతకం సాధించిన మూడో భారత అథ్లెట్‌గా గుల్వీర్ ఘనత సాధించాడు.
నేడు బరిలో నీరజ్
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగనున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యే జావెలిన్ త్రో క్వాలిఫయింగ్‌లో నీరజ్‌తోపాటు భారత్‌కే చెందిన రోహిత్ యాదవ్, యశ్‌వీర్ సింగ్ పాల్గొంటారు. మొత్తం 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్‌లో ఉన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. గురువారమే ఏడుగురు భారత క్రీడాకారులు పతకాల కోసం పోటీపడనున్నారు.

మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మార్టినా దేవి (ప్లస్ 86 కేజీలు; సాయంత్రం గం. 6:30 నుంచి), పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్ సింగ్ (ప్లస్ 110 కేజీలు; రాత్రి 11 గంటల నుంచి) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అథ్లెటిక్స్ షాట్‌పుట్ ఫైనల్లో తజిందర్ పాల్, సమర్‌దీప్ (రాత్రి గం. 11:30 నుంచి) పోటీపడతారు. మహిళల డిస్కస్ త్రో ఫైనల్లో సీమా పూనియా, నిధి రాణి (అర్ధరాత్రి గం. 1:10 నుంచి), మహిళల 5000 మీటర్ల ఫైనల్ రేసులో పారుల్ (అర్ధరాత్రి గం. 1:58 నుంచి) బరిలో ఉన్నారు.
ఈసారి వేరే కేటగిరీలో...
మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 69 కేజీల కేటగిరీలో హర్జీందర్ మొత్తం 227 కేజీల బరువెత్తి (స్నాచ్‌లో 101 + క్లీన్ అండ్ జర్క్‌లో 126) రెండో స్థానంలో నిలిచింది. మూడు ప్రయత్నాల్లోనూ తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ వచ్చిన హర్జీందర్ స్నాచ్‌లో వరుసగా 96, 99, 101 కిలోలు... క్లీన్ అండ్ జెర్క్‌లో వరుసగా 120, 123, 126 కేజీలను ఎత్తింది. కెనడాకు చెందిన చార్లోట్ సిమోనూ (240 కేజీలు) స్వర్ణం గెలుచుకోగా, ఫీబ్ హేమన్ (ఆ్రస్టేలియా; 218 కేజీలు) కాంస్యం సాధించింది.

వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది 7వ పతకం. పంజాబ్‌లోని నభాకు చెందిన 29 ఏళ్ల హర్జీందర్ 2022 బర్మింగ్‌హామ్ క్రీడల్లో 71 కేజీల విభాగంలో కాంస్యం గెలుచుకుంది. ఈసారి కేటగిరీ మారడంతో పాటు తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసి సిల్వర్ మెడల్‌తో మెరిసింది. మహిళల 77 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ సంజన పూర్తిగా నిరాశపరిచింది. సంజన స్నాచ్‌లో 94 కేజీలను మూడు ప్రయత్నాల్లోనూ ఎత్తలేకపోయింది.
మన పంచ్ అదిరింది...
బాక్సింగ్‌లో బుధవారం భారత్‌కు ఆరు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో సాక్షి (51 కేజీలు), అరుంధతి (70 కేజీలు), జైస్మీన్ (57 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సాక్షి 5–0తో కైట్లిన్ (నార్నర్త్ ఐర్లాండ్)పై, అరుంధతి 3–1తో మోర్గాన్ హెండర్సన్ (న్యూజిలాండ్)పై, జైస్మీన్ 4–1తో ఎలీస్ గ్లిన్ (ఇంగ్లండ్)పై గెలిచారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్ (60 కేజీలు), అంకుశ్ (80 కేజీలు), నరేందర్ (ప్లస్ 90 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు.

క్వార్టర్ ఫైనల్స్‌లో సచిన్ 5–0తో ట్రెజర్ మొరెమి (బోట్స్‌వానా)పై, అంకుశ్ 5–0తో జేడ్ మికాక్ (సీషెల్స్)పై, నరేందర్ 3–2తో మైకేల్ సికో (సమోవా)పై విజయం సాధించారు. ఓవరాల్‌గా బాక్సింగ్‌లో భారత్‌కు 10 పతకాలు ఖాయమయ్యాయి. ఇప్పటికే లవ్లీనా (75 కేజీలు), ప్రియ (60 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జాదుమణి సింగ్ (55 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. బాక్సింగ్ పోటీలకు నేడు విశ్రాంతి. శుక్రవారం సెమీఫైనల్స్ జరుగుతాయి. సెమీఫైనల్లో ఓడిన వారికి కాంస్య పతకాలు లభిస్తాయి.


