ఖేలో ఇండియాకు రూ. 29 వేల కోట్లు | Increase in funding for national sports federations | Sakshi
Sakshi News home page

ఖేలో ఇండియాకు రూ. 29 వేల కోట్లు

Aug 1 2026 4:19 AM | Updated on Aug 1 2026 4:19 AM

Increase in funding for national sports federations

రానున్న ఐదేళ్ల వ్యయానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

జాతీయ క్రీడా సమాఖ్యల నిధుల పెంపు

ఓవరాల్‌గా క్రీడలకు రూ. 36,441 కోట్ల కేటాయింపు  

న్యూఢిల్లీ: దేశంలో క్రీడాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఖేలో ఇండియా’ పథకంతో పాటు జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌)లకు భారీగా నిధులు పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐదేళ్లలో దేశంలో క్రీడల కోసం రూ. 36,441 కోట్ల బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో ఒక్క ‘ఖేలో ఇండియా’ పథకానికే రూ. 29,054 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది ఎనిమిది రెట్లు అధికం కావడం గమనార్హం. 

గ్రామీణ స్థాయి క్రీడాకారుల్లో నైపుణ్యాలను పెంచడం... ప్రతిభావంతులను గుర్తించి వారిని అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు తీర్చిదిద్దడానికి ఇవి తోడ్పడనున్నాయి. ఇక 2030లో భారత్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణ, 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్‌ దాఖలు చేసిన నేపథ్యంలో దేశాన్ని గ్లోబల్‌ స్పోర్టింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్లయింది. ‘గత ‘ఖేలో ఇండియా’ పథకానికి కేటాయించిన నిధుల కంటే దాదాపు ఎనిమిది రెట్లు అధిక నిధులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇది దేశాన్ని ప్రపంచస్థాయి క్రీడా శక్తిగా మార్చాలన్న ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తోంది’ అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.  

చదువుతోపాటు ఆటలు... 
రాబోయే ఐదేళ్లలో జాతీయ క్రీడా సమాఖ్యలకు రూ. 7,387 కోట్లు కేటాయించారు. పాఠశాల స్థాయిలోనే క్రీడలను ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా ఫీడర్‌ స్కూల్స్‌’ (కేఐఎఫ్‌ఎస్‌), ‘ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయ’ (కేఐయూవీ) అనే రెండు కొత్త కార్యక్రమాలను కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతో చదువుతో పాటు ఆటలకు సమాన ప్రాధాన్యం లభించనుంది. మహిళా క్రీడాకారిణులు, పారా అథ్లెట్లు, దేశీయ సాంప్రదాయ క్రీడలకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు. అథ్లెట్ల సమగ్ర వివరాలు, మౌలిక వసతులు, శిక్షణ వనరులు, ప్రతిభాన్వేషణ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు డిజిటల్‌ స్పోర్టింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. 

ప్రస్తుతం అమలులో ఉన్న అథ్లెట్ల ప్రోగ్రామ్‌తో పాటు ‘ఎమర్జింగ్‌ ఖేలో ఇండియా అథ్లెట్స్‌’ అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టారు. దీని ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులకు నిపుణుల పర్యవేక్షణలో శాస్త్రీయ శిక్షణ లభించనుంది. 2017లో ఖేలో ఇండియా పథకాన్ని ప్రారంభించగా... ప్రస్తుతం దీని కింద 2800 మంది అథ్లెట్లు మెరుగైన శిక్షణ పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ‘ఖేలో ఇండియా సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ (కేఐసీఓఈ), ‘ఖేలో ఇండియా అక్రెడిటెడ్‌ అకాడెమీస్‌’ (కేఐఏఏ), ‘ఖేలో ఇండియా సెంటర్స్‌’ (కేఐసీ), యూత్‌ స్పోర్ట్స్‌ కంపెనీస్‌ (వైఎస్‌సీ)లో అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement