పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఏఐ నిధులు దాచాలి
కెరీర్‌లో ఒడిదుడుకులను తట్టుకోవడానికి దోహదపడే కవచం
మారుతున్న కాలానికి అనుగుణంగా అవసరమంటున్న నిపుణులు
సాక్షి స్పెషల్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన కళ్ల ముందే సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిస్తోంది. నిత్యం చేసే పనులు, డేటా విశ్లేషణ వంటి రంగాలను ఏఐ వేగంగా భర్తీ చేస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో సంప్రదాయ ఉద్యోగాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా, కాలేజీ పూర్తి చేసుకుని బయటకొచ్చే యువతకు మొదటి ఉద్యో గం సంపాదించడం మునుపటి కంటే సవాలుగా మారవచ్చు. మారుతున్న కాలంలో పిల్లలను కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకునే యంత్రాలుగా మార్చకుండా.. సృజనాత్మకంగా ఆలో చించేలా, సరికొత్త నైపుణ్యాలు పెంపొందించుకునేలా, ఏఐతో కలిసి పనిచేసేలా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు.
‘ఏఐ రిస్క్ ఫండ్’ నేటి తరం అత్యవసరం!
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల భవి ష్యత్తు కోసం ‘ఏఐ రిస్క్ ఫండ్’ లేదా ఒక ప్రత్యేకమైన పొదుపు ఖాతాను ఏర్పాటు చేయడం ఇప్పుడు చాలా అవసరం. పిల్లల పెళ్లిళ్లకు, కాలేజీ ఫీజులకు డబ్బు దాచినట్లే.. ఏఐ యుగంలో వారి కెరీర్ స్థిరపడే వరకు ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒక ‘రిస్క్ మేనేజ్‌మెంట్ ఫండ్’ అవసరమని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గతాన్ని గమనిస్తే, ఏ కొత్త సాంకేతికత వచ్చినా పాత ఉద్యోగాలను తుడిచేసి, సరికొత్త అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, పాతవి పోవడానికి, కొత్తవి పుట్టుకురావడానికి మధ్య కొంత సమయం (ట్రాన్సిషన్ పీరియడ్) పడుతుంది. ఈ లోపు పిల్లలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడకుండా నిలబడడానికి ఈ ‘రిస్క్ ఫండ్’ ఒక సంజీవనిలా పనిచేస్తుంది.
ఏఐని శత్రువుగా కాదు.. మిత్రుడిగా చూడాలి!
ఒకప్పుడు మంచి మార్కులు, పెద్ద డిగ్రీలు ఉంటే ఉద్యోగం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ నేడు కేవలం మార్కులు సరిపోవు. ఏఐ యుగంలో రాణించాలంటే సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, వినూత్న ఆలోచనలు ప్రాణాధారాలు. పిల్లలు ఏఐని చూసి భయపడకుండా, దానిని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా, ఏఐ నుంచి సరైన సమాధానాలు రాబట్టడానికి ‘సరైన ప్రశ్నలు అడగడం’ అనేది అత్యంత కీలకమైన నైపుణ్యంగా మారబోతోంది.
‘ఏఐ ఫండ్’ వల్ల ముఖ్య ప్రయోజనాలు
పిల్లలు చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం ఏఐ వల్ల మారిపోతే, వారు తక్షణమే మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త టెక్నాలజీని (ఏఐ టూల్స్, డేటా అనలిటిక్స్ మొదలైనవి) నేర్చుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. చదువు పూర్తి కాగానే వెంటనే ఉద్యోగం రాకపోయినా, ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా, తదుపరి కెరీర్ ప్లాన్ చేసుకోవడానికి ఈ ఫండ్ ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం వెతకడం కంటే, సొంతంగా ఏఐ టూల్స్ ఉపయోగించి స్టార్టప్‌లు లేదా సరికొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ పొదుపు మొత్తమే తొలి పెట్టుబడిగా మారుతుంది.


