‘ఏష నాగుల కట్టమీద యేసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాల..’ ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎక్కడ చూసినా ఇదే పాట. ఇన్‌స్టాలో లక్షల్లో రీల్స్.. ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన క్లిప్పులే కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు తెలంగాణ పల్లెల్లో, దావత్‌ల్లో, పండుగల్లో, పెళ్లిళ్లలో వినిపించిన పాట ఇప్పుడు సినిమా ప్రమోషన్‌లో భాగమై.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘ది ప్యారడైజ్’ నుంచి విడుదలైన ‘ఏష నాగుల’ పాటకు వస్తున్న రెస్పాన్స్ దీనికి తాజా ఉదాహరణ.
అయితే ఇది ఒక్క పాటతో మొదలైన ట్రెండ్ కాదు. కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ క్రమంగా తమ పరిధిని పెంచుకుంటూ వస్తున్నాయి. ఒకప్పుడు జానపద గీతం అంటే పల్లె వాతావరణానికే పరిమితమనే భావన ఉండేది. ఇప్పుడు అదే పాట థియేటర్‌లో మాస్ సెలబ్రేషన్‌కు, సోషల్ మీడియాలో రీల్స్‌కు, ఫంక్షన్లలో డ్యాన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పల్లె నుంచి పట్టణానికి.. అక్కడి నుంచి పాన్ ఇండియా ప్రేక్షకుల వరకు తెలంగాణ జానపదం తన జోరు చూపిస్తోంది.
‘సారంగ దరియా’తో మొదలైన కొత్త ఊపు
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు ఇటీవల కాలంలో వచ్చిన అతిపెద్ద మలుపుల్లో ‘సారంగ దరియా’ ఒకటి. లవ్‌స్టోరీ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్‌తో ఈ పాటకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అసలు తెలంగాణ జానపద సంప్రదాయంలో ఉన్న పాటను సినిమాకు తగ్గట్టుగా కొత్త రూపంలో తీసుకొచ్చారు. 2021లో విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఫోక్ ట్యూన్‌కు సినిమా విజువల్స్, మాస్ బీట్ తోడైతే ఏ రేంజ్‌లో రీచ్ వస్తుందో ‘సారంగ దరియా’ చూపించింది.
‘రాములో రాములా’.. ఫోక్ బీట్‌కు కమర్షియల్ టచ్
ఆ తర్వాత ‘అల..వైకుంఠపురములో’మూవీలోని ‘రాములో రాములా’ కూడా తెలంగాణ యాస, జానపద పదజాలం, మాస్ బీట్‌ను కమర్షియల్ సినిమా సౌండ్‌తో కలిపిన పాటగా నిలిచింది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ గాత్రం.. తమన్ సంగీతం.. కాసర్ల శ్యామ్ తెలంగాణ నేటివిటీతో కూడిన పదాలు.. ఈ కాంబినేషన్ పాటను జనాల్లోకి తీసుకెళ్లింది.ఇక్కడే టాలీవుడ్ మ్యూజిక్‌లో ఒక మార్పు మొదలైంది. ఫోక్ అంటే కేవలం పల్లె పాట కాదు.. ఫోక్‌ను కమర్షియల్‌గా ప్యాకేజ్ చేస్తే అదే మాస్ ఆంథమ్ అనే ఫార్ములా వర్కవుట్ అయింది.
‘దసరా’లో పల్లె మట్టి వాసన
ఆ తర్వాత ‘దసరా’లోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ తెలంగాణ జానపదానికి మరింత మాస్ రూపాన్ని ఇచ్చింది. ఈ పాటలో కేవలం ఫోక్ ట్యూన్‌ను ఉపయోగించడం కాకుండా నిజమైన జానపద కళాకారుల గాత్రాలను కూడా వినిపించారు. రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు గన్నోర దాస లక్ష్మి, గొట్టె కనకవ్వ, పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న వంటి జానపద కళాకారులు పాటలో భాగమయ్యారు. అంటే.. సినిమా పాటలో ఫోక్ కలపడం నుంచి ఫోక్‌నే సినిమా పాటగా మార్చే స్థాయికి టాలీవుడ్ వచ్చేసింది. అలాగే ఇదే సినిమాలోని ‘చమ్కీల అంగీలేసి’పాట కూడా తెలంగాణ పదాలతో సాగుతుంది.
‘ఊరు పల్లెటూరు’.. జానపదానికి అసలైన నేటివిటీ
‘బలగం’సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటలో తెలంగాణ పల్లె జీవితం, మట్టి వాసన, వ్యవసాయం, కుటుంబ బంధాలు, ఊరి అనుబంధం అన్నీ కనిపిస్తాయి. మంగ్లీ, రామ్ మిరియాల, భీమ్స్ సిసిరోలియో పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇక్కడ పాట కేవలం హీరో-హీరోయిన్ కోసం పెట్టిన డ్యాన్స్ నంబర్ కాదు. కథలోని ఊరిని, అక్కడి మనుషులను, వారి జీవన విధానాన్ని పరిచయం చేసే కథన సాధనంగా మారింది. ఇదే ‘బలగం’ పాటలకు ప్రత్యేకత తీసుకొచ్చింది.
‘కాలేజీ పాప’తో పల్లె యాస.. పట్టణ కుర్రాళ్ల వైబ్స్
తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు మరో ఆసక్తికరమైన రూపం మ్యాడ్ సినిమాలోని ‘కాలేజీ పాప’ పాట. కాసర్ల శ్యామ్ రాసిన తెలంగాణ యాస పదాలను భీమ్స్ సిసిరోలియో సంగీతంతో మాస్ ఫీల్‌లోకి తీసుకొచ్చారు. పాటలోని పదాలు పక్కా లోకల్‌గా ఉన్నా.. టార్గెట్ మాత్రం కాలేజీ యూత్. తెలంగాణ ఫోక్ అంటే గ్రామీణ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. అర్బన్ యూత్ కూడా అదే యాసను ఎంజాయ్ చేస్తోందని ఈ పాట మరోసారి నిరూపించింది.
‘ఏష నాగుల’.. ఎందుకింత వైరల్?
ఇక ప్రస్తుతం ‘ఏష నాగుల’ పాట ఆ ట్రెండ్‌కు కొత్త బెంచ్‌మార్క్ పెట్టేలా కనిపిస్తోంది. ‘ది ప్యారడైజ్’ కోసం కాసర్ల శ్యామ్ ఈ పాపులర్ ఫోక్ హుక్‌ను తీసుకుని కొత్త లిరిక్స్‌ను జోడించారు. అసలు జానపద గీతంలోని గుర్తుండిపోయే భాగాన్ని ఉంచుతూనే.. సినిమా ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త సౌండ్, కొత్త ఎనర్జీని ఇచ్చారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ప్రొడక్షన్, జానపద గాత్రం, నాని మాస్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఇవన్నీ కలిసి పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పాట విడుదలైన వెంటనే యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లోకి రావడం, మిలియన్ల వ్యూస్ సాధించడం ఈ క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఇవే కాదు ‘గున్నా గున్నా మామిడి’ (రాజా ది గ్రేట్), ‘దిగు దిగు దిగు నాగ’ (వరుడు కావలెను) వంటి పక్కా తెలంగాణ జానపదాలను కూడా సినిమాల్లో పెట్టి.. హిట్ కొట్టారు.
మొత్తానికి.. తెలంగాణ పల్లె పాటకు పట్టం కట్టిన టాలీవుడ్.. ఇప్పుడు ఆ పాటనే బాక్సాఫీస్ ప్రమోషన్ మంత్రంగా మార్చేస్తోంది. ‘ఏష నాగుల’ నుంచి మరోసారి స్పష్టమవుతున్న విషయం ఒక్కటే.. తెలంగాణ ఫోక్ ఇక ఊరి గడప దాటింది. వెండితెరపై అడుగుపెట్టి.. సోషల్ మీడియాను ఊపేస్తూ.. పాన్ ఇండియా దిశగా పరుగులు పెడుతోంది


