నాగ్‌ బర్త్‌డే పోస్ట్‌కి పొరపాటున అసభ్య ఆడియో.. హీరోయిన్‌పై ట్రోలింగ్‌! | Pragya Jaiswal Faces Trolling Over Instagram Story Posted On Nagarjuna Birthday, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

నాగ్‌ బర్త్‌డే పోస్ట్‌లో పొరపాటున అసభ్య ఆడియో.. ప్రగ్యా జైస్వాల్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌

Aug 30 2026 9:17 AM | Updated on Aug 30 2026 11:25 AM

Pragya Jaiswal Trolled For Her Birthday Post Of Nagarjuna

సినీ తారలకు ఎంత ఫాలోయింగ్‌ ఉంటుందో.. అంతే స్థాయిలో ట్రోలింగ్‌ కూడా ఉంటుంది. చిన్న తప్పు చేసినా దాన్ని క్షణాల్లో వైరల్‌ చేసి.. సోషల్‌ మీడియాలో ఆడేసుకుంటారు. అందుకే సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్ట్‌ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లేదంటే ఉన్న పరువు కాస్తా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నటి ప్రగ్యా జైస్వాల్‌ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కింగ్‌ నాగార్జునకు పుట్టినరోజు(ఆగస్టు 29) శుభాకాంక్షలు చెబుతూ ఆమె పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మంచి ఉద్దేశంతో పెట్టిన పోస్ట్‌ కాస్తా.. చివరకు మీమ్స్‌, ట్రోలింగ్‌కు కారణమైంది.

అసలేం జరిగింది?
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ కూడా నాగార్జున ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ‘హ్యాపీ బర్త్‌డే నాగార్జున గారు.. మీ ఎనర్జీ, ఛార్మ్‌ అద్భుతం’ అంటూ విషెస్‌ తెలిపింది. అయితే ఈ పోస్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ ఆడియోను యాడ్‌ చేయడంతో అసలు చిక్కు వచ్చిపడింది.

ఆడియోలో అసభ్యపదజాలం
ప్రగ్యా జైస్వాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ మ్యూజిక్‌ లైబ్రరీలో సెర్చ్‌ చేసి  ఓ ఆడియోను తన స్టోరీకి జోడించింది. అయితే ఆ ఆడియోలో అసభ్యకరమైన పదజాలం ఉన్న విషయాన్ని ఆమె కానీ, ఆమె సోషల్‌ మీడియా టీమ్‌ కానీ గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది. నాగార్జున పేరు కనిపించడంతో ఆ ఆడియోను పూర్తిగా వినకుండానే స్టోరీలో యాడ్‌ చేసి పోస్ట్‌ చేసినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సీనియర్‌ స్టార్‌ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న పోస్ట్‌లో అభ్యంతరకరమైన పదాలతో కూడిన ఆడియో రావడంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ స్టోరీకి సంబంధించిన స్క్రీన్‌షాట్లు, స్క్రీన్‌ రికార్డింగ్‌లు క్షణాల్లో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విషయం గుర్తించిన ప్రగ్యా జైస్వాల్‌ వెంటనే ఆ స్టోరీని డిలీట్‌ చేసింది. అనంతరం ఆడియోను తొలగించి.. కేవలం నాగార్జున ఫొటో, విషెస్‌తో మరో స్టోరీని రీపోస్ట్‌ చేసింది.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రగ్యా చేసిన ఈ పొరపాటుపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలుగు భాషపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం వల్లే ఆ ఆడియోలోని పదాలను ఆమె గుర్తించలేకపోయి ఉండొచ్చని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం సెలబ్రిటీల సోషల్‌ మీడియా ఖాతాలను నిర్వహించే డిజిటల్‌, పీఆర్‌ టీమ్‌ల నిర్లక్ష్యమే ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement