ప్రేక్షకులందు సినిమా ప్రేక్షకులు వేరయా...అది ఆటైనా, పాటైనా ...వేడుకేదైనా, వేదికేదైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కార్యక్రమం రూపుదిద్దుకుంటే మాత్రం చాలు ఆ కార్యక్రమం విజయవంతమైనట్లే. కాని సినిమా ప్రేక్షకులు మాత్రం వీటన్నిటికీ విభిన్నం. విషయాన్ని సూటిగా చెబితే సినీ ప్రేక్షకులు అలరించరు. అదే విషయానికి కాస్త మసాలా దట్టించి చెప్పాలనుకున్న విషయాన్ని వినూత్నంగా చివరాఖరిలో చెబితేనే సినిమా అలరిస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పటితరం వైవిధ్యానికి పెద్ద పీట వేస్తోంది.ఆ నేపధ్యంలో వచ్చిన సినిమా ఉయిర్. ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇది మళయాళ సినిమా అయినా హాట్ స్టార్ లో తెలుగులోనూ లభ్యమవుతోంది. ప్రముఖ మళయాళ రచయితలు షాజీ, నిఖిల్ రాసిన కథకు పద్మకుమార్ ప్రాణం పోసిన సినిమానే ఉయిర్. ఈ సినిమా ప్రారంభం నుండి శుభం కార్డు వరకు ప్రేక్షకుడిలో ఆమితాసక్తిని రేకెత్తిస్తూ ఆఖరి సన్నివేశం వరకూ ఉత్కంఠ రేపుతుంది. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓ సారి చూద్దాం.
కేరళలోని కన్నూర్ సమీప ప్రాంతంలో ఉన్న ఓ పాడుబడిన బావిలో కుళ్ళిపోయిన స్థితిలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడటంతో కథ ప్రారంభమవుతుంది. కొత్తగా విధుల్లో చేరిన సబ్ఇన్‌స్పెక్టర్ అజీబ్‌కు ఈ కేసు దర్యాప్తు బాధ్యత అప్పగిస్తారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ జాయ్ పర్యవేక్షణలో అజీబ్ తన మొదటి పెద్ద కేసుగా దీన్ని తీసుకుంటాడు. ప్రారంభంలో ఎలాంటి క్లూస్ దొరకకపోయినా, ఆ శవం వేసుకోనున్న బట్టలు, చేతి గాజుల ఆధారంగా ఆ మహిళ కర్ణాటక సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన వలస కార్మికురాలు 'శోభ' అని గుర్తిస్తారు.విచారణ ముందుకెళ్ళేకొద్దీ ఇది సాధారణ హత్య కాదని దీని వెనుక పెద్ద మోసపూరిత కుట్ర దాగుందని అజీబ్ కు అర్థమవుతుంది. శోభ హత్య సమయంలో తప్పిపోయిన శోభ పిల్లల గురించి అజీబ్ ఆరా తీస్తుంటాడు. మరో వైపు అజీబ్‌కు చిన్నతనంలోనే తన సొంత చెల్లెలు తప్పిపోయిన చేదు జ్ఞాపకం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. దానికి ఈ హత్యకు ఓ లింకు కూడా ఉంటుంది. మరి శోభను హత్య చేసిన అసలు నేరస్థుడిని అలాగే శోభ పిల్లలను అజీబ్ వెతికి పట్టుకుంటాడా లేదా అన్నది మాత్రం ఉయిర్ సినిమాలోనే చూడాలి. ఈ సినిమా స్క్రీన్ ప్లే మాత్రం ఊహకందని రీతిలో పరిగెడుతుంది. మస్ట్ వాచ్ థ్రిల్లర్ ఫర్ ది వీకెండ్.


