చీకటి తర్వాత వెలుగు రావడం ఎంత సహజమో.. వరుస పరాజయాల తర్వాత ఓ విజయం పలకరించడం కూడా అంతే సహజమని మరోసారి నిరూపించాడు మాస్ మహారాజా రవితేజ. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరోకు ఎట్టకేలకు ‘ఇరుముడి’తో హిట్ దొరికింది. అది కూడా మాములు హిట్ కాదు.. బ్లాక్ బస్టర్.సినిమా రిలీజై వారం రోజులు గడిచినా ఇప్పటికే ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్స్‌కి పోటెత్తున్నారు. దీంతో కలెక్షన్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు రూ.150 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అప్పుడెప్పుడో రూ. 100 కోట్లు..
రవితేజ ఖాతాలో రూ. 100 కోట్ల వసూళ్ల సినిమా పడి చాలా కాలమైంది. 2022లో వచ్చిన ధమాకా ఒక్కటే సెంచరీ కొట్టింది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. ఈ నాలుగేళ్లలో ఆయన 6 సినిమాలు చేస్తే.. వాటిలో ఏ ఒక్కటి కూడా హిట్ టాక్‌ని సంపాదించుకోలేదు. కొన్ని సినిమాలు అయితే కనీసం రూ. 10 కోట్ల వసూళ్లను రాబట్టలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇరుముడితో హిట్ కొట్టి.. పాత లెక్కలన్నీ సరిచేశాడు. మరి ఇకపై ఈ మాస్ మహారాజ సినీ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి.


