PC: ICC/BCCI
దాయాదులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. ఇరుదేశాల అభిమానుల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. ప్రపంచకప్ కంటే కూడా చిరకాల ప్రత్యర్థిపై తమ జట్టు గెలవడాన్నే ఫ్యాన్స్ గొప్పగా చూస్తారు. కాబట్టి ఈ ప్రభావం మైదానంలోనూ కనిపించడం సహజమే.
అందుకే టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ జారవిడవగానే.. అప్పటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కోపంతో ఊగిపోయాడు. బహిరంగంగానే అతడిపై అసంతృప్తి వెళ్లగక్కాడు. తాజాగా ఈ విషయం గురించి సూర్య మరోసారి గుర్తు చేసుకున్నాడు.
భారీ తేడాతో గెలుపు
కాగా స్వదేశంలో ఈ ఏడాది వరల్డ్ ఆడిన భారత జట్టు.. దాయాది పాకిస్తాన్ కోసం తటస్థ వేదికైన శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడింది. ఈ క్రమంలో గ్రూప్-ఎలో భాగంగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్- పాక్ తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.
ఓపెనర్ ఇషాన్ కిషన్ దంచికొట్టడం (40 బంతుల్లో 77)తో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.
అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, కెప్టెన్ సూర్య అసంతృప్తి వ్యక్తం చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ విషయం గురించి భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య మరోసారి స్పష్టతనిచ్చాడు.
బౌలింగ్ ఇవ్వమని పేచీ
‘‘మ్యాచ్ మొదలైనప్పటి నుంచి కుల్దీప్ యాదవ్‌కు పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో అతడు నిరాశ చెందాడు. నిజానికి తనకు బౌలింగ్ చేయాలని ఉంది. అయితే, నేను అక్షర్ పటేల్ బౌలింగ్ పూర్తైన తర్వాత తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యాలను బరిలోకి దించాను.
అప్పుడు కుల్దీప్.. ‘నాకెందుకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు’ అన్నట్లుగా ముఖం మాడ్చుకున్నాడు. నిజానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో షాహిన్ ఆఫ్రిది బంతిని గాల్లోకి లేపినపుడు.. లాంగాన్‌లో కుల్దీప్ సులువుగానే ఆ క్యాచ్ పట్టేయొచ్చు.
అందుకే నాకు కోపం వచ్చింది
అతడికి ఆ నైపుణ్యం ఉంది. కానీ కుల్దీప్ క్యాచ్ జారవిడిచాడు. అప్పుడు నాకు బాగా కోపం వచ్చింది. ప్రయత్నం చేసిన తర్వాత కూడా బంతి చేజారి ఉంటే నేనేమీ అనకపోయేవాడిని. కానీ అతడు క్యాచ్ అందుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే నాకు కోపం వచ్చింది.
ఆ రీల్‌తో..
‘మ్యాచ్ తర్వాత మేమిద్దరం ఒకరిని ఒకరం కోపంగా చూసుకున్నాం. అతడు ముఖం కందగడ్డలా ఎర్రగా మారిపోయింది. నేను కూడా అతడిని తీక్షణంగా చూశాను’ అన్నట్లుగా స్క్రీన్ మీది దృశ్యాలు చూసి అంతా ఊహించుకున్నారు. నిజానికి మేము కోపం తగ్గిన తర్వాత సరదాగా అలా చేశాము.
అహ్మదాబాద్‌కు రాగానే కుల్దీప్‌తో కలిసి రీల్ చేయాలనే ఆలోచన వచ్చింది. కొన్నిసార్లు ఉద్వేగాల్ని చల్లార్చడానికి ఇలాంటి ఆలోచనలు ఉపకరిస్తాయి’’ అని సూర్యకుమార్ యాదవ్ గుర్తుచేసుకున్నాడు. కాగా ఆ ‘గొడవ’ తర్వాత సూర్య కుల్దీప్‌ను ఉద్దేశించి.. ‘జర కోపం వదిలెయ్ భాయ్’ అంటూ రీల్ విడుదల చేశాడు.
దీంతో అప్పటి వరకు ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందంటూ ఆందోళన పడిన అభిమానులు రీల్ చూసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ మూడు ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే, 17.2 ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో షాహిన్ ఆఫ్రిది సిక్స్‌కు ప్రయత్నించగా కుల్దీప్ క్యాచ్ జారవిడిచాడు.
చదవండి: సారథ్య బాధ్యతల నుంచి తప్పించడంపై సూర్యకుమార్ స్పందన


