సెమీఫైనల్‌ లక్ష్యంగా... | India faces Hong Kong today in the Womens Asia Cup T20 tournament | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్‌ లక్ష్యంగా...

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

India faces Hong Kong today in the Womens Asia Cup T20 tournament

నేడు హాంకాంగ్‌తో భారత్‌ పోరు

మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నీ

రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రసారం

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 టోర్నీ తొలి మ్యాచ్‌లో  స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయిన భారత మహిళల బృందం తమ తర్వాతి పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో మరో బలహీన జట్టు హాంకాంగ్‌తో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత జట్టుకు సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారవుతుంది. గత మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌పై విజయం సాధించినా... షఫాలీ వర్మ మినహా ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. టి20ల్లో అరంగేట్రం చేసిన ప్రతీక రావల్‌తో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, ఓపెనర్‌ స్మృతి, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్, దీప్తి శర్మ ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో 29 పరుగుల వ్యవధిలోనే జట్టు 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. 

బౌలింగ్‌లో రాణించడంతో తుది ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చినా... తమ మిడిలార్డర్‌ను చక్కదిద్దుకునేందుకు భారత్‌కు ఇది సరైన అవకాశం. షఫాలీ మరోసారి చెలరేగితే జట్టుకు మంచి ఆరంభం లభించడం ఖాయం. స్మృతి అంచనాలకు అనుగుణంగా చెలరేగాల్సి ఉండగా, జెమీమా గాయంతో ఈ టోర్నీకి అవకాశం దక్కించుకున్న ప్రతీక భవిష్యత్తుకు ఇక్కడి ప్రదర్శన కీలకం కానుంది. ఇటీవలి టి20 వరల్డ్‌ కప్‌ వైఫల్యం తర్వాత ఈ ఫార్మాట్‌లో తన కెరీర్‌ ముగింపు దశలో ఉన్న హర్మన్‌ కూడా బ్యాటింగ్‌లో మెరుగవ్వాల్సి ఉంది. బౌలింగ్‌లో మాత్రం జట్టు పటిష్టంగా ఉండటం సానుకూలాంశం. 

గత మ్యాచ్‌లో పేసర్లు క్రాంతి, నందని శర్మలతో పాటు ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమ రావత్, దీప్తిలను ఆడించిన మన జట్టు ఈసారి వ్యూహం మారుస్తుందా అనేది చూడాలి. మరోవైపు భారత్‌తో పోలిస్తే ప్రత్యర్థి హాంకాంగ్‌ అన్ని రకాలుగా బలహీనమైన జట్టు. తమ తొలి మ్యాచ్‌లో ఆ జట్టు ఆరు పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌ చేతిలో ఓడింది. ఆల్‌రౌండర్‌ కేరీ చాన్, యాస్మిన్, కెప్టెన్‌ మర్యమ్, పేసర్‌ అలీసాన్‌ జట్టులో కీలక సభ్యులుగా తమ వంతు పాత్ర పోషించగలరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement