కొలువుల పేరిట దళారుల వల | Fraud in the name of unemployed jobs in the joint Visakhapatnam district | Sakshi
Sakshi News home page

కొలువుల పేరిట దళారుల వల

Sep 7 2026 3:46 AM | Updated on Sep 7 2026 3:46 AM

Fraud in the name of unemployed jobs in the joint Visakhapatnam district

ప్రభుత్వ గురుకులాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఉద్యోగాలిప్పిస్తామని బురిడీ 

నకిలీ నియామక పత్రాలతో ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల వరకు వసూలు 

సర్వశిక్ష అభియాన్, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నియామకాలు జరుగుతున్నట్టు నమ్మిస్తున్న ముఠా 

యలమంచిలి రూరల్‌ (అనకాపల్లి జిల్లా): ఉమ్మడి విశాఖ జిల్లాలో నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అందినకాడికి దండుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ)పేరుతో గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ.25 వేలకు పైగా వేతనం వస్తుందని నమ్మించి వారివద్ద నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేసుకుంటున్నారు. ఒక్కో పోస్టుకు రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మోసానికి ఏకంగా పీఎంశ్రీ లోగో, ఎన్‌ఎస్‌డీసీ లెటర్‌ హెడ్లను ఉపయోగించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో గురుకుల పాఠశాలలను ఉపయోగించుకుంటున్నారు. నకిలీ నియామక పత్రాలతో వస్తున్న నిరుద్యోగులను తమ గురుకులాల్లో పని చేసేందుకు ప్రిన్సిపాళ్లు కూడా అనుమతిస్తుండడం కేటుగాళ్లకు మరింతగా కలిసి వస్తోంది.  

కొక్కిరాపల్లి గురుకులంలో వెలుగులోకి.. 
కొక్కిరాపల్లి డాక్టర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకులంలో ఇటీవల నకిలీ నియామక పత్రంతో ఓ యువతి ఆరోగ్య సహాయకురాలిగా విధుల్లో చేరారు. ఐదు రోజులుగా ఆమె గురుకుల పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఇద్దరు యువతులకు డిజిటల్‌ అసిస్టెంట్లుగా నకిలీ నియామకపత్రాలు ఇచ్చారు. వీరు తమకు గురుకులంలో విధుల్లో చేరినట్టు జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వాలని అడగడంతో కొక్కిరాపల్లి గురుకులం ప్రిన్సిపాల్‌ అందుకు నో చెప్పారు. తాము ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వబోమని స్పష్టం చేయడంతో నియామకాలపై అనుమానం బలపడింది. ఇదే తరహాలో తాళ్లపాలెం బాలికల గురుకుల పాఠశాలలో కూడా ఇద్దరు యువతులను విధుల్లోకి అనుమతించినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మిగతా గురుకులాల్లో కూడా పోస్టులు ఉన్నాయని నకిలీ ముఠా నిరుద్యోగులకు వల వేస్తున్నట్టు తెలుస్తోంది.  

ఎస్‌ఎస్‌ఏ, ఎన్‌ఎస్‌డీసీ పేరుతో.. 
సర్వశిక్ష అభియాన్, నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మీ స్కూళ్లకు ఉచితంగా సి­బ్బందిని అందిస్తామని, నియమించిన వారికి తామే వేతనాలు చెల్లిస్తామని ఓ ముఠా కొద్దిరోజుల క్రితం ఉమ్మడి జిల్లాలో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లను నమ్మించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని ప్రిన్సిపాళ్లకు చెప్పా­రు. హెల్త్, డిజిటల్‌ అసిస్టెంట్ల పోస్టులతో పాటు మ­రికొన్ని పోస్టుల్లో నియామకాలు చేపడతామని చెప్పారు. ఈ పోస్టులను సర్వశిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో నియమిస్తున్నట్టు నమ్మబలుకుతున్నారు. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ వ్యవహారానికి కొందరు వ్యక్తులను నియమించుకున్న ముఠా అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాల నిర్వాహకుడి ద్వారా పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ కళాశాల నిర్వాహకుడు జిల్లాలో ప్రైవేటు కళాశాలల యజమానులకు గురుకులాల్లో సర్వ శిక్ష అభియాన్‌ పోస్టుల భర్తీ చేస్తున్నట్టు చెబుతున్నాడు. అతని మాటలు నమ్మిన కొందరు తమకు తెలిసిన పూర్వ విద్యార్థులకు ఈ పోస్టుల విషయం చెబుతున్నారు. 

వెంటనే పోస్టుల కోసం బయోడేటా పంపించమంటున్న కేటుగాళ్లు.. ఆ వెంటనే ఆయా గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్ల చిరునామాతో ముద్రించిన ఆరు పేజీల నియామక పత్రాన్ని ఈ–మెయిల్, వాట్సాప్‌కు పంపించి సంబంధిత గురుకులానికి వెళ్లి విధుల్లో చేరాలని సూచిస్తున్నారు. నకిలీ నియామక పత్రాలతో వెళ్తున్న వా­రిని గురుకులాల ప్రిన్సిపాళ్లు వారిని అనుమతించడంతో.. మరికొందరు పోస్టుల కోసం ఆశపడి కేటుగాళ్లకు డబ్బు సమర్పించుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement