‘క్లిక్‌’ చేస్తే.. ఖాతా ఖాళీ | UPI fraud cases have increased by 80 percent in the last two years | Sakshi
Sakshi News home page

‘క్లిక్‌’ చేస్తే.. ఖాతా ఖాళీ

Sep 7 2026 3:56 AM | Updated on Sep 7 2026 3:56 AM

UPI fraud cases have increased by 80 percent in the last two years

గత రెండేళ్లలో 80 శాతం పెరిగిన యూపీఐ మోసాల సంఖ్య

ఆరు నెలల్లో 6.32 లక్షల ఫిర్యాదులు

రూ.485 కోట్లు నష్టపోయిన ప్రజలు

కేంద్ర నివేదికల్లో వెల్లడి

సాక్షి, అమరావతి: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) దేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసింది. రోడ్డు పక్కన దుకాణం నుంచి షాపింగ్‌ మాల్స్‌ వరకు చెల్లింపుల విషయంలో సామాన్యుడి జీవితాన్ని సులభతరం చేసింది. ఇది ఎంత వేగంగా విస్తరించిందో.. మోసాల తీవ్రత కూడా అంతే ప్రమాదకర స్థాయికి చేరింది. సైబర్‌ నేరస్తులు యూపీఐని ఉపయోగించుకొని సామాన్యుల కష్టార్జితాలను దోచేస్తున్నారు. పార్లమెంట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ సమర్పించిన నివేదికలు, ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) గణాంకాల ప్రకారం.. దేశంలో నమోదవుతున్న మొత్తం సైబర్‌ నేరాల్లో ఏకంగా 85 శాతం ఆర్థిక మోసాలే. 

ముఖ్యంగా దేశంలో యూపీఐ మోసాల సంఖ్య గత రెండేళ్లలో 80 శాతానికి పైగా పెరిగింది. ఆరు నెలల వ్యవధిలోనే 6.32 లక్షల యూపీఐ సంబంధిత ఫిర్యాదులు రాగా.. దాదాపు రూ.485 కోట్ల మేర ప్రజల సొమ్ము మాయమైంది. నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ డేటా ప్రకారం, 2021లో కేవలం రూ.551 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌ ఆర్థిక నష్టాలు.. ఏటా రెట్టింపవుతూ రూ.22 వేల కోట్లకు పైగా ఎగబాకింది. దేశంలో ప్రతి ఐదుగురు యూపీఐ వినియోగదారుల్లో ఒకరు సైబర్‌ ఉచ్చులో పడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

కేటుగాళ్ల సరికొత్త ఎత్తుగడలు
» గతంలో మాదిరిగా కేవలం ఓటీపీ అడగడం వరకే సైబర్‌ నేరగాళ్లు పరిమితం కావడం లేదు. ఏఐ సాంకేతికతతో సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. డబ్బులు జమ అవుతాయని నమ్మించి ‘రిక్వెస్ట్‌ మనీ’ లింక్‌ పంపడం.. పిన్‌ ఎంటర్‌ చేయించి ఖాతా ఖాళీ చేస్తున్నారు. 
» గూగుల్‌ సెర్చ్‌లో బ్యాంకు, యూపీఐ యాప్‌ల పేర్లతో నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లు పెడుతున్నారు. రిమోట్‌ యాక్సెస్‌ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేయిస్తున్నారు. తర్వాత వినియోగదారులకు మాయమాటలు చెప్పి.. వారి సొమ్ము కాజేస్తున్నారు.
» అలాగే సీబీఐ, పోలీసుల పేర్లతో భయభ్రాంతులకు గురిచేసి డిజిటల్‌ అరెస్ట్‌ లేదంటే స్టాక్‌ మార్కెట్లలో భారీ లాభాల పేరిట తప్పుడు ఖాతాల్లోకి నిధులు మళ్లిస్తున్నారు.

బాధితులు ఏం చేయాలి
»  మోసానికి గురైన వెంటనే మొదటి గంట  అత్యంత కీలకం. ఆ సమయంలో ఫిర్యాదు చేయగలిగితే కొంత వరకూ ప్రయోజనం ఉండవచ్చు.
» మోసం జరిగిన వెంటనే జాతీయ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కి కాల్‌ చేయాలి లేదా సైబర్‌క్రైమ్‌.జీవోవీ.ఇన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. దీనివల్ల బాధితుడి ఖాతా నుంచి వెళ్లిపోయిన సొమ్ము వేరే ఖాతాల్లోకి చేరకుండా ‘ఫ్రీజ్‌’ చేసే అవకాశం ఉంటుంది.
» సంబంధిత బ్యాంకుకు తక్షణమే సమాచారం ఇచ్చి యూపీఐ సేవలు, ఏటీఎం కార్డులను బ్లాక్‌ చేయించాలి.
» ఆర్బీఐ పోర్టల్‌ (ఛిఝట.టbజీ.ౌటజ.జీn) ద్వారా బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు.

ఇవి అస్సలు చేయకండి
» మీ ఖాతాలోకి డబ్బులు జమ కావడానికి యూపీఐ పిన్‌ నమోదు చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకు అధికారులు, కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమని చెప్పినా యూపీఐ పిన్, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోకండి.
» క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసినప్పుడు లేదా మొబైల్‌ నంబర్‌ ద్వారా పంపేటప్పుడు స్క్రీన్‌పై కనిపించే లబ్ధిదారుడి అసలు పేరును ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.
» స్క్రీన్‌ షేరింగ్‌ లేదా రీఫండ్‌ ప్రాసెస్‌ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే థీమ్‌ వ్యూవర్, ఎనీ డెస్క్‌ వంటి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయకండి.
»  లాటరీలు, క్యాష్‌బ్యాక్, విద్యుత్‌ బిల్లు బకాయిల పేరుతో వాట్సాప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లలో వచ్చే లింకులను నొక్కి పేమెంట్లు చేయకండి.
» కస్టమర్‌ కేర్‌ నంబర్ల కోసం సెర్చ్‌ ఇంజిన్లపై ఆధారపడొద్దు. అధికారిక యాప్‌ లేదా బ్యాంకు పాస్‌బుక్‌లోని నంబర్లనే వాడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement