5 నెలల్లో టన్నుకు రూ.26 వేలు పెంచిన ఫీడ్ కంపెనీలు
గగ్గోలు పెడుతున్న ఆక్వా రైతులు
కంపెనీలకు వంత పాడుతున్న చంద్రబాబు ప్రభుత్వం
నేడు మత్స్యశాఖ కమిషనరేట్ ముట్టడికి పిలుపు
ధరలు తగ్గించే వరకు దశలవారీ పోరాటాలకు నిర్ణయం
సాక్షి, అమరావతి: ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) చట్టానికి తూట్లు పొడుస్తూ ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారంగా మేత ధరలు పెంచుతున్నా పట్టించుకోని చంద్రబాబు సర్కార్ తీరును నిరసిస్తూ ఆక్వా రైతులు మరోసారి ఆందోళనబాట పట్టారు. ధరల పెంపును వెనక్కి తీసుకునే వరకు దశల వారీగా పోరాటాలు చేయాలని ఆక్వా రైతు సంఘాలు తీర్మానించాయి. సోమవారం విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ఏపీ రొయ్య రైతు సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సాగు సమ్మె (క్రాప్ హాలిడే) చేపడతామని హెచ్చరిస్తున్నారు.
రొయ్యల ఫీడ్ ధర భారీగా పెంపు
ఫిబ్రవరిలో రొయ్యల మేత ధర టన్నుకు రూ.4 వేలు చొప్పున పెంచిన ఫీడ్ కంపెనీలు జూన్‌లో రూ.10 వేల నుంచి రూ.12 వేల మేర పెంచాయి. తాజాగా మరోసారి రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకు ధరలు పెంచేశాయి. సగటున టన్నుకు రూ.26వేల ధర పెరిగింది. ఫలితంగా కిలో వెనామీ రొయ్యల ఉత్పత్తికి రూ.300, టైగర్ రొయ్యల ఉత్పత్తికి రూ.450 వరకు ఖర్చవుతోంది.
రొయ్య ధరలు మాత్రం పెంచకపోగా కౌంట్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గిస్తూ రైతులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. దీంతో ఫీడ్ ధరలను తరచూ పెంచే విధానాన్ని నిలిపివేయాలని ఏపీ రొయ్య రైతుల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. కనీసం ఏడాది పాటు ఒకేధర కొనసాగేలా చూడాలని కోరుతోంది. ఏటా నవంబర్ లేదా డిసెంబర్‌లో ధరల సమీక్ష చేపట్టాలని, రైతుల అంగీకారం లేకుండా ధరలు పెంచకూడదని డిమాండ్ చేస్తోంది. నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలు, లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న హేచరీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద రొయ్యల కొనుగోలు ధరల మార్పులు, ధరల స్థిరీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఎన్‌ఎఫ్‌డీబీ వంటి సంస్థల సహకారంతో ఆక్వా రైతులకు సబ్సిడీలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల సమస్యలపై తక్షణమే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా 6నెలల పాటు క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఏపీ రొయ్య రైతుల సమాఖ్య కన్వీనర్ దుగ్గినేనిగోపీనాథ్ స్పష్టం చేశారు.


