102 జీవోతో చిక్కు రిజర్వేషన్లకు ముప్పు | Shocking facts about MBBS seat allocation lists | Sakshi
Sakshi News home page

102 జీవోతో చిక్కు రిజర్వేషన్లకు ముప్పు

Sep 7 2026 4:16 AM | Updated on Sep 7 2026 4:16 AM

Shocking facts about MBBS seat allocation lists

బలహీనవర్గాల విద్యార్థులకు చంద్రబాబు సర్కారు వెన్నుపోటు

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దక్కాల్సిన ఎంబీబీఎస్‌ సీట్లకు గండి

మెరుగైన ర్యాంకు సాధించిన విద్యార్థులకు దక్కని ఓపెన్‌ సీట్లు

ఒకే కాలేజీలో.. ఒకే రిజర్వేషన్‌లో ఎక్కువ ర్యాంకర్లకు రిజర్వేషన్‌ సీట్లు

తక్కువ ర్యాంక్‌ వచ్చిన వారికి ఎంఆర్‌సీలో సీట్లు

సీట్ల కేటాయింపు జాబితాల్లో విస్తుపోయే అంశాలు 

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌ 2026–27 విద్యా సంవత్సరం తొలి దశ ప్రభుత్వ కోటా సీట్లను ఇటీవల ఆరోగ్య విశ్వవిద్యాలయం కేటాయించింది. నీట్‌లో 23,550 ర్యాంక్‌ సాధించిన ఓ విద్యార్థికి ఆంధ్రా మెడికల్‌ కాలేజీలో బీసీ–ఏ రిజర్వేషన్‌ కింద సీటు కేటాయించారు. ఈ విద్యార్థి కంటే ఎక్కువ ర్యాంక్‌ అంటే 23,789 ర్యాంక్‌ సాధించిన బీసీ–ఏ వర్గానికి చెందిన మరో విద్యార్థికి ఓపెన్‌ క్యాటగిరి(ఓసీ)లో మెరిటోరియస్‌ రిజర్వుడు క్యాండిటేడ్‌ (ఎంఆర్‌సీ) కింద సీటు వచ్చింది. 31,325 ర్యాంక్‌ తెచ్చుకున్న విద్యార్థికి గుంటూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో బీసీ–బీ రిజర్వేషన్‌ సీటు ఇచ్చారు. అదే కాలేజీలో బీసీ–బీ వర్గానికి చెందిన విద్యార్థి 36,860 ర్యాంక్‌తో ఎంఆర్‌సీలో సీటు దక్కించుకున్నారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో 30,611 ర్యాంక్‌ సాధించిన విద్యార్థికి బీసీ–డీ కింద సీటు రాగా, అదే వర్గానికి చెందిన 30,767 ర్యాంక్‌ విద్యార్థికి ఎంఆర్‌సీలో సీటు వచ్చింది. 

జీవో–102తో గందరగోళం
నీట్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించిన విద్యార్థులను వారి రిజర్వేషన్లకు పరిమితం చేసి బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వైద్యవిద్య కలను చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన 102 జీవో ఛిద్రం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌పరం చేస్తూ గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో 2,450 ఎంబీబీఎస్‌ సీట్లను మన విద్యార్థులు కోల్పోయేలా చంద్రబాబు చేశా­రు. 

ఇది చాలదన్నట్టుగా కొన్నేళ్లుగా సజావుగా సాగుతున్న ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను జీవో–102 ద్వారా గందరగోళంగా మార్చే­శారు. ఫలితంగా మెరిట్‌ ఆధారంగా ఓపెన్‌ కేటగిరిలో సీటు దక్కించుకోవాల్సిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను రిజర్వేషన్‌ కోటాకు పరిమితం చేసి, ఆయా వర్గాల్లోని ఇతర విద్యార్థుల అవకాశాలకు ప్రభుత్వమే గండి కొట్టేసింది. హెల్త్‌ యూనివర్సిటీ ఇటీవల సీట్లు కేటాయించిన జాబితాలను పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు జరిగిన అన్యాయం స్పష్టమవుతోంది.

మెరుగైన ర్యాంక్‌ సాధించినా..
ఒకే రిజర్వేషన్‌లో ఒకే కాలేజీలో సీట్లు పొందిన విద్యార్థుల ర్యాంక్‌లను పరిశీలిస్తేనే విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఆంధ్రా, రంగరాయ, గుంటూరు, కర్నూలు సహా చాలా వైద్య కళాశాలల్లో ఒకే రిజర్వేషన్‌కు చెందిన టాప్‌ ర్యాంకర్లు రిజర్వేషన్‌కు పరిమితం కాగా.. అంతకంటే ఎక్కువ ర్యాంక్‌ సాధించిన విద్యార్థులు ఎంఆర్‌సీలో సీట్లు దక్కించుకున్నారు. ఉత్తమ ర్యాంక్‌ సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఓపెన్‌లో కాకుండా వారి రిజర్వేషన్లలోనే సీట్లు కేటాయించడంతో ఆయా రిజర్వేషన్‌లోని ఇతర విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన దుస్థితి నెలకొంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో 102 ప్రధాన కారణంగా మారింది. 

గత ప్రభుత్వంలో 151 జీవో ప్రకారం 2025–26 విద్యా సంవత్సరం వరకూ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగింది. అప్పటివరకూ రాష్ట్రంలో టాప్‌ ర్యాంకర్లు రిజర్వేషన్‌కు పరిమితమై, మిగిలిన విద్యార్థులకు అన్యాయం జరిగిన ఘటనలు ఏనాడూ చోటుచేసుకోలేదు. జీవో 151 రద్దు చేసి సజావుగా సాగుతున్న కౌన్సెలింగ్‌ను 102 జీవో ఇవ్వడం ద్వారా బాబు సర్కారే గందరగోళం చేసేసిందని వైద్య విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. 

రెండు జీవోల మధ్య వ్యత్యాసం ఇలా
వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియపై హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్‌ జగన్‌ హయాంలో నిపుణుల కమిటీ వేశారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశాల ప్రక్రియలో కొన్ని సంస్కరణలు ప్రవేశపెడుతూ జీవో–151 తెచ్చారు. ఈ జీవో ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్‌ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలను ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లుగా ఎంచుకునేవారు. ఈ ఆప్షన్ల ఆధారంగా ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో హెల్త్‌ వర్సిటీ సీట్లు కేటాయించేది. ఇదిలా ఉండగా జీవో–102 తెచ్చిన చంద్రబాబు సర్కార్‌ విద్యార్థులు అన్ని ఆప్షన్లు పెట్టుకోవాల్సిన పని లేకుండా చేసింది. దీంతో టాప్‌ స్కోర్‌ సాధించిన విద్యార్థులు సైతం తమ రిజర్వేషన్లలోనే సీట్లు రావడంతో ఏకంగా 70 మంది రిజర్వేషన్‌ విద్యార్థులు సీట్లు కోల్పోయిన దౌర్భాగ్యం నెలకొంది. ఇదిలా ఉంటే జీవో 102 ద్వారా ఎవరికి అన్యాయం జరగలేదని హెల్త్‌ యూనివర్సిటీ బుకాయిస్తోంది. 

గతేడాది ఓపెన్‌లో 964 మంది రిజర్వేషన్‌ విద్యార్థులు సీట్లు దక్కించుకోగా.. ఈ దఫా 1,172 మంది సీట్లు దక్కించుకున్నారని కాబట్టి అంతా సక్రమంగానే నడిచిందని వాదిస్తోంది. వాస్తవాలను పరిశీలిస్తే గతేడాది రాష్ట్రస్థాయిలో నీట్‌ ర్యాంకర్లలోని తొలి 2 వేల మందిలో 1,069 మంది రిజర్వేషన్, మిగిలిన విద్యార్థులు ఓసీలుగా ఉన్నారు. ఈ ఏడాది తొలి 2వేల మందిలో రిజర్వేషన్‌ విద్యార్థుల సంఖ్య 1,153కు పెరగ్గా, ఓసీ విద్యార్థుల సంఖ్య 847కు పడిపోయింది. ఈ లెక్కన గతేడాదితో ఆటోమేటిక్‌గా ఓపెన్‌ కేటగిరిలో సీట్లు పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. కానీ.. 102 జీవోతో ఎవరూ నష్టపోలేదని ప్రభుత్వం వాదిస్తుండటం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement