పుట్టినరోజు నాడే నూరేళ్లు నిండాయి! | 24 Year Old Dies In Horrific Bus Accident Near NAD Junction In Visakhapatnam, Check More Details Inside | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు నాడే నూరేళ్లు నిండాయి!

Sep 7 2026 11:21 AM | Updated on Sep 7 2026 11:39 AM

Visakhapatnam Young Man Road Incident

విశాఖపట్నం: నేడు పుట్టినరోజు. కొత్త దుస్తులు ధరించి, మిత్రులతో సరదాగా గడపాలి. అమ్మానాన్నల ఆశీస్సులు అందుకోవాలి. ఇదీ ఆ యువకుడి ఆశ. కానీ, విధి మరోలా తలచింది. పుట్టినరోజు సంబరాల ఏర్పాట్లు చేసుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా మృత్యువు కాటేసింది. స్నేహితుడితో కలిసి బైక్‌పై వస్తుండగా ఎన్‌ఏడీ జంక్షన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బస్సు మీద నుంచి వెళ్లిపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుక కూర్చున్న స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. 

రెండు బస్సుల మధ్య.. 
ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన తంగుడు మదన్‌ (24) ఆదివారం తన పుట్టినరోజు కావడంతో పార్టీ ఏర్పాట్ల నిమిత్తం మిత్రుడు మణికుమార్‌తో కలిసి బైక్‌పై కంచరపాలెం వెళ్లాడు. పనులు ముగించుకుని ఎన్‌ఏడీ వైపు జాతీయ రహదారిలో వస్తుండగా, ఎన్‌ఎస్‌టీఎల్‌ గేటు ఎదురుగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో వీరు ముందు వెళ్తున్న ఫార్మా బస్సును ఢీకొని కిందపడిపోయారు. ఆ సమయంలో మదన్‌పై నుంచి ప్రైవేట్‌ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో మదన్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న కంచరపాలెం యువకుడు మణికుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్, ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో కేజీహెచ్‌కు తరలించారు. బస్సు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
సొంతింటి ఈఎంఐ కోసం శ్రమిస్తూ.. 
మదన్‌ తల్లిదండ్రులు ఎన్‌ఏడీ జంక్షన్‌లో తోపుడు బండిపై టిఫిన్‌ సెంటర్‌ నడుపుతున్నారు. మదన్‌ డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూనే, ఈవెంట్లలో డెకరేషన్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఇటీవలే శాంతినగర్‌లో ఒక ఫ్లాట్‌ కొనుగోలు చేయగా, దానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బాధ్యతలు మోస్తూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు.. పుట్టినరోజే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘నువ్వు లేకపోతే మాకెవరురా దిక్కు’ అంటూ ఆ తల్లి పెడుతున్న రోదనలు స్థానికులను కలచివేశాయి.   

చదవండి: భోగాపురంలో దారుణం.. యువకుడ్ని బైక్‌కు తాళ్లతో కట్టేసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement