మురళీనగర్: నగరంలో నివసిస్తున్న కేరళీయులు తమ సాంప్రదాయ వేడుక ఓనంను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ‘నమో కేరళీయం’ అంటూ కుల, మత భేదాలకు అతీతంగా ఆచార వ్యవహారాలతో వేడుకలు జరుపుకున్నారు. బిర్లా కూడలి సమీపంలోని కేరళ కళాసమితిలో ఈ ఉత్సవాలు జరిగాయి.తమ సంస్కృతి, సాంప్రదాయాలను ఎక్కడ ఉన్నా కొనసాగిస్తామని, మాతృభాష మళయాళానికి ప్రాధాన్యతనిస్తామని వారు చాటిచెప్పారు. కళాసమితిని అందంగా ముస్తాబు చేసి ఓనంకు ఆహ్వానం పలికారు.
పూక్కళం వద్ద పూజలు
ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద ధాన్యపు రాశులు, కొబ్బరి పువ్వు, దీపపు కుందెలు ఏర్పాటు చేసి, పూల తివాచీ పూక్కళంను అమర్చారు. మహిళలు పూక్కళం ఏర్పాటులో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులతో అలరించారు.బలి చక్రవర్తి ఉత్సవ ప్రాంగణానికి విచ్చేయగా మహిళలు పూలతో స్వాగతం పలికారు. కేరళ సాంప్రదాయ వాద్య పరికరాలతో సందడి చేశారు. కేరళ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని బలి చక్రవర్తి ఆశీర్వదించారు.
సామాజిక సేవలో కేరళీయుల ముందంజ
ముఖ్య అతిథిగా పాల్గొన్న కేరళ ఎమ్మెల్యే వీటీ బలరామ్ మాట్లాడుతూ కేరళీయులు ఎక్కడ ఉన్నా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారని తెలిపారు. తెలుగు ప్రజలతో మమేకమై జీవించాలని ఆకాంక్షించారు.ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కేరళీయులు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ఆదర్శనీయమన్నారు. నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ అబ్రహాం వర్ఘీస్, ఐడీఏఎస్ ఆనంద్ అచ్యుతన్ కుట్టీ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో కేరళ కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌ఎం పిళ్లై, కె. హరిదాస్, కోశాధికారి ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పలువురికి సత్కారం
వివిధ రంగాల్లో రాణించిన కేరళీయులను ఎమ్మెల్యే వీటీ బలరామ్ చేతుల మీదుగా సత్కరించారు. జాతీయ అవార్డు గ్రహీత, కేరళ సినీ నేపథ్య గాయని వైకం విజయలక్ష్మిని ఘనంగా సత్కరించారు.‘కళాకేళం’ మ్యాగజైన్‌ను వీటీ బలరామ్, కేఏ జాన్, నందినీ మీనన్ తదితరులు ఆవిష్కరించారు. కేరళ సాంప్రదాయ నృత్యాలు, చిత్ర గీతాలు ఆకట్టుకున్నాయి. ఓనం సందర్భంగా 29 రకాల వంటకాలతో తయారు చేసిన ‘సద్య’ను విందుగా అందించారు.విశాఖ నగరం, పరిసర ప్రాంతాలకు చెందిన 1500 మంది కేరళీయులు ఉత్సవంలో పాల్గొన్నారు.


