ఏఐ డేటా సెంటర్లపై
పునఃపరిశీలన చేయాలి
నీరు, విద్యుత్, భూములు, పర్యావరణంపై ప్రభావాలను అంచనా వేయాలి
రాయితీలు, ఉద్యోగాలు, ప్రాజెక్టు వివరాలను ప్రజలకు వెల్లడించాలి
డాబాగార్డెన్స్: విశాఖలో భారీ ఏఐ డేటా సెంటర్లకు ప్రజల భూములు, నీరు, విద్యుత్‌ను ధారాదత్తం చేసే ముందు ప్రభుత్వం సమగ్రంగా పునఃపరిశీలన చేయాలని జాతీయ స్థాయి ప్రజా సదస్సులో పలువురు వక్తలు సూచించారు. గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో ఆదివారం డాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జాతీయ స్థాయి ప్రజా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ విశాఖలో ఇప్పటికే నీటి వనరులపై ఒత్తిడి ఉన్న నేపథ్యంలో భారీ డేటా సెంటర్లకు నీటి కేటాయింపులపై ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నగర తాగునీరు, సాగునీటి అవసరాలు, భవిష్యత్ జనాభా పెరుగుదల, పారిశ్రామిక అవసరాలు పరిగణనలోకి తీసుకుని స్వతంత్ర సంస్థతో సమగ్ర వాటర్ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమయ్యే విద్యుత్ పరిమాణం, విద్యుత్ గ్రిడ్‌పై పడే ఒత్తిడి, బ్యాకప్ విద్యుత్ వ్యవస్థలు, వాటి వల్ల ఏర్పడే పర్యావరణ సమస్యలపై నిపుణులతో సమగ్ర అధ్యయనం చేయాలని కోరారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలన్నారు.
కూలింగ్ వ్యవస్థలతో నీటి వినియోగం ౖపైపెకి
స్వాచ్ ఏపీ సభ్యుడు శ్రీపత్‌రాయ్ మాట్లాడుతూ విశాఖలో ప్రతిపాదిత డేటా సెంటర్లలో లక్షలాది కంప్యూటింగ్ యూనిట్లు నిరంతరం పనిచేయడం వల్ల భారీగా విద్యుత్ వినియోగం ఉంటుందని, అదే సమయంలో ఉత్పత్తయ్యే వేడిని నియంత్రించేందుకు కూలింగ్ వ్యవస్థలు అవసరమవుతాయన్నారు. కూలింగ్ సాంకేతికతను బట్టి నీటి వినియోగం గణనీయంగా ఉండే అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేయాలన్నారు. మానవ హక్కుల వేదిక సభ్యుడు వీఎస్ కృష్ణ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలే అభివృద్ధి పేరిట పర్యావరణంపై ఒత్తిడి పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు.
పర్యావరణ అనుమతులపై అనుమానాలు
మద్రాసు హైకోర్టు న్యాయవాది డి.నాగశైలజ మాట్లాడుతూ డేటా సెంటర్లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసిన విధానంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. భారీ ప్రాజెక్టులకు పర్యావరణ ప్రభావాలను సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉండగా, ప్రాజెక్టు స్వరూపం, నిర్మాణ విస్తీర్ణం, నీటి వినియోగం, డీజిల్ నిల్వలు వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరమన్నారు. విశాఖలో ప్రతిపాదిత ఏఐ డేటా సెంటర్ల నేపథ్యంలో పర్యావరణం, ప్రజా వనరులు, భూ హక్కులు, విద్యుత్, నీటి వినియోగం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు సంబంధించి పలు కీలక డిమాండ్లతో విశాఖపట్నం డిక్లరేషన్‌ను ప్రకటించారు.


