దద్దరిల్లిన
సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం రెండు రోజుల నిరసనకు స్పందన లేకపోవడంతో రోడ్డెక్కిన ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై మండిపాటు.. సమస్యల పరిష్కారానికి డిమాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రధాన జంక్షన్‌లో రాస్తారోకో నినాదాలతో హోరెత్తిన ప్రాంతం.. స్తంభించిన ట్రాఫిక్ సంఘీభావం తెలిపిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పోలీసుల మోహరింపుతో ఉద్రిక్తత.. రాత్రి 10.30 గంటల వరకు నిరసన
సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ఉద్యోగుల ఆందోళనతో స్తంభించిన ట్రాఫిక్
బీచ్‌రోడ్డు : రెండు రోజులుగా శాంతియుతంగా నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి తరలివచ్చిన సచివాలయ ఉద్యోగులు విశాఖ నగరం నడిబొడ్డున భారీ ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కాంప్లెక్స్, ద్వారకానగర్ బస్టాండ్ కూడలిని ముట్టడించి రాస్తారోకో నిర్వహించారు. ఒక్కసారిగా వందలాది మంది ఉద్యోగులు రహదారులపైకి రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. చేతుల్లో ఖాళీ వాటర్ బాటిళ్లతో శబ్దాలు చేస్తూ, నినాదాలతో ప్రభుత్వ తీరును నిరసించారు.‘మేం ఉద్యోగులం.. ఊడిగం చేసేవాళ్లం కాదు’ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. తమను కిందిస్థాయి సిబ్బందిగా తక్కువ చేసి చూస్తున్నారని, విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో పోలీసులు, ఉద్యోగుల మధ్య స్వల్ప తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. రాత్రి మొబైల్ ఫ్లాష్ లైట్‌లతో నిరసన వ్యక్తం చేశారు.
ఉద్యోగుల దీక్ష విరమణ
అధికారుల హామీతో సచివాలయ ఉద్యోగులు రాత్రి 10.30 గంటలకు రిలే నిరాహార దీక్షలను విరమించారు. జిల్లా పంచాయతీ అధికారి, రెవెన్యూ అధికారులు, డీసీపీ దీక్షా శిబిరానికి చేరుకుని ఉద్యోగులతో చర్చించారు. వారం రోజుల్లో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, సంచాలకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో 7 వేల మంది ఉద్యోగులు ఉద్యమాన్ని విరమించగా, నిరవధిక దీక్ష చేస్తున్న 20 మంది కూడా దీక్ష ముగించారు. హామీ మేరకు సమావేశం నిర్వహించకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, వాట్సాప్ గ్రూపుల నుంచి నిష్క్రమణ, పెన్‌డౌన్ కార్యక్రమాలు చేపడతామని ఉద్యోగులు హెచ్చరించారు.


