గంభీరంలో తెలుగు తమ్ముళ్ల రియల్ దందా స్థలాలపై టీడీపీ నేతల కన్ను రెవెన్యూ, పోలీస్ అండతో పేదల పట్టాలకు ఎసరు నకిలీ పట్టాలతో రూ.12 కోట్ల వరకు దోపిడీ
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ లేఅవుట్‌లో టీడీపీ ముఠా భారీ దందాకు తెరతీసింది. సర్వే నంబర్ 125లోని పేదల ఇళ్ల స్థలాలను కొల్లగొడుతూ రూ.కోట్లు దండుకుంటోంది. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్, ఇద్దరు వార్డు సభ్యులు తమ సామాజికవర్గానికి చెందిన రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారుల అండదండలతో ఈ దారుణానికి ఒడిగడుతున్నారని స్థానికులు, బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనుకూలంగా మారిన 60 అడుగుల రోడ్డు
వైఎస్సార్ హయాంలో 2007లో ఇక్కడ 53 మంది నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది. అప్పట్లో మౌలిక వసతులు లేకపోవడంతో కొందరు మాత్రమే ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు స్థలాలను ఖాళీగా వదిలేశారు. ఇంకొందరు అవసరార్థం ఇతరులకు విక్రయించారు. అయితే ఇటీవల కార్పొరేట్ వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకు బోయపాలెం జాతీయ రహదారి నుంచి జెడ్పీ హైస్కూల్, ఇందిరమ్మ లేఅవుట్ మీదుగా గంభీరం రిజర్వాయర్ వరకు 60 అడుగుల బీటీ రోడ్డు నిర్మించారు. ఈ రహదారి నిర్మాణం టీడీపీ నేతలకు వరంగా మారింది. ఒక్కసారిగా భూముల ధరలు పెరగడంతో ‘పచ్చ’ నేతల కన్ను ఈ లేఅవుట్‌పై పడింది.
బెదిరింపులతో పట్టాల స్వాధీనం?
మొత్తం 53 మంది లబ్ధిదారుల్లో ప్రస్తుతం స్థలాల్లో లేని వారిని గుర్తించి, రూ.10 వేల నుంచి రూ.50 వేలు చేతిలో పెట్టి మభ్యపెడుతూ పట్టాలు లాక్కుంటున్నారు. గతంలో ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసిన వారిని వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్ల సహకారంతో తీవ్రంగా బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికేతరులంటూ భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లు కట్టడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అప్పట్లో కొనుగోలు చేసిన మొత్తాన్నే ముఖాన కొట్టి బలవంతంగా పట్టాలు స్వాధీనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేజిక్కించుకున్న ఒక్కో ప్లాట్‌ను బయటి వ్యక్తులకు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
నకిలీ పట్టాలతో మరో 75 ప్లాట్లు!
ఇంతటితో ఆగకుండా లేఅవుట్‌లోని కొండ భాగాన్ని, గతంలో పట్టాలు ఇచ్చిన స్థలాల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేసి 60 గజాల చొప్పున మరో 75 అనధికార ప్లాట్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీఆర్వో, ఆర్‌ఐ పూర్తి సహకారంతో నకిలీ పట్టాలు సృష్టించి ఒక్కో స్థలాన్ని రూ.16 లక్షలకు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే అధికారిక, అనధికారికంగా వందకు పైగా ఇళ్ల స్థలాలను అమ్ముకుని దాదాపు రూ.12 కోట్ల వరకు దోచుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ దందాపై మండల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, త్వరలోనే జిల్లా కలెక్టర్, భీమిలి ఆర్డీవోకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని బాధితులు చెబుతున్నారు. అర్హులైన అసలైన లబ్ధిదారులకే స్థలాలు దక్కేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


