ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ‘డైవర్షన్‌’ రాజకీయం! | Cm Chandrababu Cheats AP People With Super Six Schemes | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ‘డైవర్షన్‌’ రాజకీయం!

Sep 8 2026 10:01 AM | Updated on Sep 8 2026 11:49 AM

Cm Chandrababu Cheats AP People With Super Six Schemes

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా సెంటిమెంట్ రాజకీయాలను పండించడానికి ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల కార్యక్రమాలను అమలు చేశారా అన్న అభిప్రాయం కలుగుతుంది. తొలుత వెలుగొండ ప్రాజెక్టు నుంచి , ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల నిర్వహించారు. ఈ కార్యక్రమాలు చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కాని ఆ సందర్భంగా ఆయన అనుసరించిన పద్దతులు, చేసిన ప్రసంగాలు చూస్తే , డైవర్షన్ రాజకీయాలలో భాగమేనా అన్న సందేహం కలుగుతుంది. స్థానిక ఎన్నికలు కూడా దృష్టిలో ఉండవచ్చు. కాగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు క్రెడిట్ చోరీ ఎలా చేశారో అంకెలతో సహా జగన్ వివరించారు. 

ఆ తర్వాత పోలవరం ఎడమ కాల్వకు గ్రావిటీ ద్వారా కాకుండా, అప్పటికే అమలులో ఉన్న పుష్కర లిఫ్ట్ ద్వారా నీటిని తోడి ఈ కాల్వలో పోసి అదేదో ప్రాజెక్టు పూర్తి అయినట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారని జగన్ విమర్శించారు. దీనిని గమనిస్తే చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టడానికి తంటాలు పడుతున్నట్లు అవుతుంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక సమస్యలను ఎదుర్కుంటోంది. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చి ,సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దానిని ప్రజలు విశ్వసించడం లేదు. అంతా ఆశ్చర్యంగా ఇదేమిటి ఇలా చెబుతున్నారేమిటా అని చర్చించుకుంటున్నారు. మరో వైపు రెడ్ బుక్ పేరుతో పోలీసుల ద్వారా అరాచకాలు సాగుతున్న వైనం ప్రభుత్వ ప్రతిష్టను బాగా దెబ్బతీస్తోంది. ఉద్యోగులు తమను ప్రభుత్వం మోసం చేసిందన్న ఆగ్రహంతో ఉన్నారు.

విశాఖలో డేటా సెంటర్ల పేరుతో జరిగే కాలుష్య విధ్వంసంపై మేదావులు గళమెత్తుతున్నారు. అమరావతిలో మాత్రం వేల కోట్ల అప్పులు తెచ్చి అదిక అంచనాలతో నిర్మాణాలు జరుగుతున్న తీరుపై ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. జగన్ మావిగన్ (విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం) కారిడార్ అభివృద్దిని ప్రతిపాదించడంతో ఇరుకున పడ్డ చంద్రబాబు దానిని ఆవిగన్‌గా (అమరావతి, విజయవాడ, గుంటూరు) మార్చుకున్నారు. అయినా ఖర్చు మాత్రం కేవలం 29 గ్రామాల పరిదిలోనే చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. 

డిఎస్సి అక్రమాలతో సహా ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు చికాకుగా మారాయి. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోతోందన్న భావన ఏర్పడింది. ఈ నేపధ్యంలో వాటిని కొంతమేర పక్కదారి పట్టించి ప్రజలలో ప్రాజెక్టులకు సంబందించి ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగించడమే లక్ష్యంగా ఈ నీటి విడుదల కార్యక్రమాలు పెట్టుకున్నారని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఇందులో ఎక్కువ భాగం వాస్తవం ఉన్నట్లు అనిపిస్తుంది. లేకుంటే వెలిగొండలో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం చేయకుండా, హడావుడిగా నీటిని విడుదల చేశారు. ఆ ప్రాజెక్టు మొత్తం తన ఘనతేనని ఆయన చెప్పుకున్నారు. దానిపై జగన్ వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు.ఇక ఆ వెంటనే పోలవరం ఎడమ కాల్వకు నీరు అంటూ మరో ప్రోగ్రాం నిర్వహించారు. 

నిజంగానే పోలవరం ప్రాజెక్టు అందరూ ఆశించినట్లు పూర్తి చేసి,నీటి విడుదల జరిగి ఉంటే అంతా సంతోషిస్తారు. కాని గతంలో చంద్రబాబు హయాంలో పెట్టిన పుష్కర స్కీమ్ మోటార్లను వాడి కాల్వలో నీటిని పారించారట. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుకార్చినట్లు అవుతుందన్న భయం ప్రజలలో ఏర్పడుతోంది. మార్కాపురం వద్దకాని, అనకాపల్లి జిల్లా పాయకరావు పేట వద్ద కాని, ఆయన పంచెకట్టుతో రావడం, సాశ్టాంగ నమస్కారం చేయడం, సభికులతో గోదావరి నీళ్లు వచ్చాయి అంటూ గట్టిగా చెప్పించడం, రకరకాల సెంటిమెంట్లను చొప్పించడం వంటివి చేశారు. 

నిజంగా ఎడమ కాల్వను ఆయనే నిర్మాణం చేపట్టి ఉంటే చెప్పుకోవచ్చు. కాని ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాల్వలు తవ్వించడంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లనే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఒక దశకు చేరిందన్నది వాస్తవం. కాకపోతే చంద్రబాబుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఎత్తడం ఇష్టం ఉండదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే ఎడమ కాల్వకు మోటార్ల ద్వారా నీరుఎత్తిపోయవలసిన అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న వస్తుంది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు అంటే అంతగా ఆసక్తి లేని చంద్రబాబు, గత టరమ్ లో పట్టిసీమ లిఫ్ట్ ను పెట్టి హడావుడి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వించిన కుడి కాల్వ ద్వారా నీటిని విజయవాడ వద్ద కృష్ణానదికి తీసుకువెళ్లారు. అప్పట్లోనే పట్టిసీమ కాకుండా పోలవరానికి ఆ డబ్బు ఖర్చు చేసి సత్వరమే ప్రాజెక్టును సిద్దం చేయాలని అనేక మంది సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదు.

ఇప్పుడు తాను ఏర్పాటు చేసిన లిఫ్ట్ ల ద్వారానే నీటిని తరలిస్తున్నానని చెప్పుకోవచ్చేమో కాని, దానివల్ల జరిగే నష్టం గురించి తెలుసుకోవాలి. ఈ సీజన్ లో పట్టిసీమ ద్వారా నీటిని తరలించి కృష్ణా డెల్టాకు సాగుకు అందిస్తున్నామని గొప్పగా ప్రకటించారు. పూజలు కూడా చేశారు.కాని ఆ తర్వాత గోదావరిలో నీరు తగ్గడంతో పట్టిసీమ నుంచి నీరు రావడం తగ్గిపోయింది. దాంతో కృష్ణా డెల్టాలో సైతం పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అలాగే ప్రస్తుతం పుష్కర మోటార్లను వాడి నీటిని విడుదల చేశారు. కాని ఈ నీరు పూర్తిగా రైతులకు అందడానికి ఇంకా సమయం పడుతుంది. మోటార్లపైనే ఎప్పటికీ ఆధారపడడం అంత మంచిది కాదని అనుభవం చెబుతోంది. అలాగే ఉత్తరాంద్ర సుజల స్రవంతికి నీరు ఇవ్వడం కూడా అంత తేలికకాకపోవచ్చు. కాకపోతే జనాన్ని ప్రస్తుతానికి మభ్య పెట్టడానికి ఉపయోగపడవచ్చు. 

ఈ నేపధ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ట్వీట్ చేస్తూ పోలవరంపై డ్రామాలు ఆపాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. పురుషోత్తపట్నం పంపులతో నీటిని ఎత్తిపోస్తే ప్రాజెక్టు నుంచి ఇచ్చినట్లు ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ పంపులు కొత్తవి కావని, ఇప్పటికే ఉన్నవే కదా అని అంటూ, అయినా ఈ డ్రామా ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు పురుషోత్తమపట్నానివి అయితే, కాల్వ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించినదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో చంద్రబాబు కొత్తగా చేసిందేమిటని అన్నారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లా? లేక 41.15 మీటర్లకే పరిమితమా? అని జగన్ సూఠిగా అడిగారు.ఈ అంశంపై చంద్రబాబు స్పందించగలిగితే బాగుంటుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పై ప్రేమ అంతా ప్రసంగాలకే పరిమితమా అని జగన్ ఎద్దేవ చేశారు. ఒక వేళ 41.15 మీటర్ల వద్దే పోలవరం ప్రాజెక్టు నిలిచిపోతే ఈ కాల్వల ద్వారా ఆశించిన ప్రయోజనం నెరవేరడం కష్టం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరో వైపు పోలవరం నిర్వాసితుల కాలనీలలో అధ్వాన్న పరిస్థితులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కాగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎడమ కాల్వ నీటి విడుదలపై కామెంట్ చేస్తూ 26 నెలల్లో ఎడమ కాల్వ పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పవన్ కళ్యాణ్ కు నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన ఉంటే ఇలా వ్యాఖ్యానిస్తారా అని నిపుణులు అంటున్నారు. రెండేళ్లలో టైమ్ లో భూ సేకరణ, ఆ తర్వాత కాల్వ తవ్వకం, తదితర నిర్మాణాలు సాద్యమవుతాయా అని వారు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అమరావతి వ్యయం జనానికి కన్పించకుండా, ఉత్తరాంధ్ర, రాయలసీమలను నిర్లక్ష్యం చేయడం లేదని ప్రచారం చేసుకోవడానికి ఈ నీటి విడుదల కార్యక్రమాలు నిర్వహించారా అన్నది చర్చగా ఉంది. అదే లక్ష్యం అయితే ప్రజలను మరోసారి మభ్యపెట్టడమే అవుతుందా!


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

చదవండి: పోలవరం కల సాకారమా?.. లేక ముగింపు ప్రయత్నమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement